Tuesday, April 9, 2024

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24

తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని.

ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగుణంగా ఎన్నో మారుతున్నాయి. ఉదాహరణ కి చార్జింగ్ పెట్టీ స్విచ్ వేయటం మరిచిపోవడం. ఇది చాలా సార్లు జరిగేదే మన అందరికీ. ఇంకా ఏమైనా ఇలాంటివి ఉన్నాయా అని గుర్తు చేసుకుంటుంటే ఇపుడు నాకు ఏమి గుర్తు రావటం లేదు. అసలు గుర్తు రాకపోవటం, గుర్తు లేకపోవటం, మర్చిపోవడం, ఇవేగా అలా ఛార్జ్ పెట్టి స్విచ్ ఆన్ చేయకపోవటం లాంటివి చేయటానికి కారణాలు.

ప్రాక్టికల్ గా ఈ మధ్య ఇలాంటిదే ఒక సందర్భం రెండు సార్లు నాకు ఎదురయింది. అదేమిటి అంటే మాటిక్ వేయకుండా వాషింగ్ మెషీన్ లో బట్టలు వేయటం. బట్టలు ఆరేసినప్పుడు బట్టలకి మురికి వదలకపోవటం, బట్టల నుంచి నార ఊడిరావటం లాంటివి చూసి ఏమై ఉంటుందబ్బా అనుకుని చివరికి అరె మళ్ళీ మర్చిపోయానా అని ఖంగు తినటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. 

అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కనీస ధర్మం కదా మనం చేసే పని మీద దృష్టి పెట్టడం. ఎంతో సమయం వృధా చేసిన తర్వాత తెలుసుకుని ఇంకేం ఉపయోగం ఉంటుంది?

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.

ఈ సామెత వివరణ అప్రస్తుతం కాబట్టి ఇక విషయం లోకి వస్తే, ఇలా సగం సగం పనులు చేసి అసంపూర్తిగా పని ముగించి సమయం తో పాటు మనకున్న వనరుల్ని కూడా వృధా చేసుకోవటానికి కారణం ఏకాగ్రత లోపం అని అంటాను నేను. 

Mind Absent Body Present (MABP) అనే వారు college days లో lecturers. ఏదో ఆలోచిస్తూ చెయ్యాల్సిన పని మీద దృష్టి సారించలేక పోవటం, జరిగిపోయిన వాటి గురించి బాధ పడటం తో పాటు జరగబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల ఇవి జరుగుతాయి. 

నా విషయానికే వస్తే భవిషత్తు లో నేను చేయబోయే పని, రాబోయే దాని ఫలితం గురించి ఆలోచించే పని మెదడుకు అప్పగిస్తే చేస్తున్న పని, దాని ప్రభావ ఫలితాలే ఇలాంటి అపశృతులు.

ఎంతసేపు past లోనూ future లోనూ ఉంటే ఎవరికి అయినా ఇలా జరగొచ్చు అని చెప్పటమే నా ఈ వ్యాసపు ఉద్దేశం. 

-eckce

Wednesday, November 15, 2023

RIP - The Real Cricket Fever

B049/CWC/Indian Cricket dated at Kovvur the 15.11.T23

2023 క్రికెట్ వరల్డ్ కప్ మొదలైన ఒక వారం తర్వాత ఒక friend అడిగాడు క్రికెట్ follow అవుతున్నావా అని. అవుతున్నా అని అన్నాను. కానీ కాసేపటికే నిజం చెప్పేశాను. ఆ నిజం ఏమిటో తెలుసుకునే ముందు ఒకప్పుడు ఇండియా లో క్రికెట్ కి ఉన్న ప్రాధాన్యత గురించి కాసేపు మాట్లాడుకోవాలి. ఎన్నో పనికి మాలిన విషయాల కంటే ఇది కాస్త ముఖ్యమైనదే. 1999 కి ముందు నాకు క్రికెట్ గురించి తెలియదు. నిజానికి అప్పటికి ఏమి తెలియని వయసు. ఏమి తెలియని వయసులోనే క్రికెట్ గురించి కొంచెం తెలుసు అంటే దాని ప్రభావం ఎంత ఉండేది అనేది అర్థం చేస్కోవచ్చు.1999 క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో చాలామంది మా టీవి ముందు కూర్చుంటున్నారు అని నేను కావాలని మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి కరెంట్ పోయింది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నాకు క్రికెట్ చూడాలనే ఆసక్తి బలవంతంగా ఏర్పడటానికి మా ఊరిలో అప్పటికి ఇరవయ్యేళ్ల వయసున్న కుర్రమూకే కారణం. 1999 world cup నేను చూసాను కానీ, నాకు ఏమి గుర్తు లేదు. కానీ ఇండియా మ్యాచ్ ఓడిపోయిన రోజు భోజనం మానేసిన మనుషులు మా ఊర్లో ఉండటం తెలుసు. 

అప్పట్లో బూస్ట్ డబ్బా తో పాటు ఒక కార్టూన్ మాగజైన్ free గా వచ్చింది. అందులో అన్నీ క్రికెట్ గురించిన విషయాలు బొమ్మలతో ఇంగ్లీష్ లో ఉండేవి. అందులో ముఖ్యంగా కపిల్ దేవ్, టెండూల్కర్, శ్రీనాథ్, కుంబ్లే, జయసూర్య, వార్న్, మురళీధరన్ వీళ్ళ గురించి ఎక్కువ ఉండేవి. Catches win the matches అనే slogan అందులోనే నేను ముందుగా చూసాను. ఇక్కడ జయసూర్య గురించి ఒకటి చెప్పాలి. మా నాన్న కు పెళ్లి అనే శ్రీకాంత్, సిమ్రాన్, కృష్ణంరాజు సినిమాలో ఒక పాటలో జయసూర్య డక్ ఔట్ అయితే చెయ్ చెయ్ ఎంజాయ్ అనే లిరిక్ ఉంటుంది, 1996 లో జయసూర్య అంత విధ్వంసకర బ్యాట్స్మన్ అని మా బావ గారు ఒకసారి చెప్పారు.

మళ్ళీ ఆ Circket జ్వరం 2003 కి నాకు బాగా తాకింది. ఈ లోపే కొన్ని క్రికెట్ మ్యాచ్ లు టీవీ లో చూడటం, బయట గల్లీ క్రికెట్ ఆడటం, లోకల్ టోర్నమెంట్ లు, inter village బెట్ మ్యాచ్ లకి వెళ్లి ఇష్టంగా చూడటం తో పాటు ఈనాడు పేపర్ లో బుధవారం ఛాంపియన్ అనే స్పోర్ట్స్ ఎడిషన్ లో ఎక్కువ క్రికెట్ గురించి తెలుసుకోవటం తో పాటు, ఇష్టం కూడా పెంచుకున్నాను. ఒకరోజు పక్క ఊరి ఆటగాళ్ళు మా ఊరు వచ్చారు బెట్ మ్యాచ్ ఆడటానికి. నేను అది చూడటానికి వెళ్ళాను. వాళ్లంతా సైకిళ్ళ మీద వచ్చారు. కానీ ఆ రోజు ఉన్న ఒక్క కార్ల్ బాల్ పగిలిపోయింది. అపుడు బాల్ ఖరీదు ముప్పై అయిదు రూపాయిలు. మ్యాచ్ ఆపేసి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అర్థం అవుతుంది 35/- బంతి కొనలేకపోయారు అంటే అప్పటికి వారి బెట్ ఇంకా తక్కువ అవ్వాలి, లేదా బంతి మా ఊళ్తో దొరక్కపోయి ఉండాలి. ఆ రోజు ఆదివారం. ఇంటికి వెళ్లేసరికి దూర దర్శన్ లో ఒక చిన్న మాట అనే సినిమా వస్తుంది. 

2003 world cup మాత్రం బాగా follow అయ్యాను. గంగూలీ కి అభిమాని గా మారిన రోజులు అవి. ఆ సీజన్ లో మూడు సెంచరీ లు బాదాడు. ఆస్ట్రేలియా మీద తప్ప అన్ని టీమ్ ల మీద జట్టును గెలిపించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన రోజు శివరాత్రి. తర్వాత రోజు ఈనాడు పేపర్ లో headline పాక్ కు కాళరాత్రి భారత్ కు శివరాత్రి. ఫైనల్ మ్యాచ్ చూడటం కోసం మా friend ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఆ రోజు తేదీ మార్చ్ 23. పవన్ కళ్యాణ్ Johnny cinema పాటలు అప్పుటికే బయటకి వచ్చాయి. ఇంటికి వెళ్ళే సరికి మొదటి ఇన్నింగ్స్ అయిపోయింది. Break లో Road మీద కుర్రోళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనోళ్లు కొడతారా కొట్టారా అని. కొట్టలేరని వాళ్ల మనసు చెప్తున్నా కొట్టాలి అని వారి కోరిక అడుగుతుంది. సచిన్ out అయ్యాడు. ఇక మ్యాచ్ కూడా అయిపోయింది. ఒక పక్క సెహ్వాగ్ కొడుతున్నా కూడా సచిన్ తర్వాత అందరూ పోతూ ఉన్న బాధే బయటకు తెలుస్తుంది. ఆ రోజు ఆస్ట్రేలియా టీమ్ లోని ప్రతి పేరు నాకు నోట్లోనే ఉండిపోయింది. అప్పుడప్పుడు నెమరు వేసుకునే వాడిని. Damien Martin, Mathew Hayden, Adam Gilchrist, Michael Bevan, Darren Lehmann, Ricky Ponting (నిజానికి నాతో పాటు భారత్ క్రికెట్ అభిమాని అనే ప్రతి ఒక్కడు వీడి మీద కోపం పెంచుకున్న రోజులు అవి).


తర్వాత ఇండియా అందరి మీద గెలిచేది కానీ ఆస్ట్రేలియా మీద మాత్రం ఓడిపోయేది. నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఉన్నప్పుడు ఎన్నో మ్యాచ్ లు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఆగి చూసే వాళ్ళం. Andrew Symonds గురించి గొప్పగా చెప్పుకునే వారు. అలాంటి ఒక సందర్భం లో సచిన్ మరియు లక్ష్మణ్ లు ఆస్ట్రేలియా మీద century లు కొట్టారు అని విని ఆశ్చర్యపోయాను. ఆ మ్యాచ్ లు ఆస్ట్రేలియా లో జరిగేవి అనుకుంట live telecast వచ్చే ఛానల్ మా ఊర్లో వచ్చేది కాదు. అపుడు రేడియో లో కామెంటరీ వినే వాళ్ళం. అసలు 2003 world cup కి లక్ష్మణ్ స్థానం లో దినేష్ మోంగియా ను తీసుకున్నారు అనే వారు. అప్పుడు సెహ్వాగ్ 300 కొట్టాక నేను నా ఆనందాన్ని మా అమ్మతో share చేసుకున్నాను. అప్పుడు క్రికెట్ ఆడే వాడిని కూడా. Sports Page లో చూసి పిచ్ కొలతలు అవి చూసి అలాగే కొలవటానికి గ్రౌండ్ కి 22 మీటర్ల తాడు కూడా తీసుకెళ్ళాను. Hero Honda sticker అతికించిన బ్యాట్ కూడా మా నాన్న చేత కొనిపించుకున్నా. 


ఇంటర్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ world cup వచ్చింది. గ్రూప్ స్టేజ్ లోనే బంగ్లాదేశ్ చేతిలో మట్టి కరిచి బెర్ముడా traingle ను సచిన్ యువరాజ్ కలిసి చేదించిన తర్వాత నేను Eamcet కోచింగ్ కి వెళ్ళిపోయాను. అక్కడ మొదటి రోజే మ్యాచ్ పెట్టారు. శ్రీలంక చేతిలో బిస్కట్ అయింది ద్రావిడ్ సేన. కట్ చేస్తే కోచింగ్ అయింది, Eamcet రాశాను, రాంక్ వచ్చింది. College లో seat వచ్చింది. Fees కట్టడం కోసం ఒక బంగారు గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తూ నన్ను తీసుకెళ్లారు మా నాన్న. అదే రోజు మొదటి T20 world cup గెలిచిన ఇండియా టీమ్ కు ఘన స్వాగతం పలుకుతుంది భారత్ మీడియా. ఒక్కో ఆటగాడికి కోటి రూపాయిలు నజరానా ప్రకటించటం ఆ బంగారు కొదువ కొట్టు లోని టీవీ లోనే చూసాను. ఇందాక cut చేయక ముందు చెప్పాలి అంటే T20 world cup చూడలేకపోయాను. ఎందుకంటే మా ఊర్లో ఆ ఛానల్ రాదు. నా కంటే ఉత్సాహవంతులు పక్క ఊరు వెళ్లి తర్వాత రోజు వచ్చి చెప్పేవారు. అందులో యువరాజ్ ఆరు six లు గురించి వాళ్ళు చెప్పటం నేను వినటం అదో గొప్ప అనుభూతి. Final match మాత్రం టీవీ9 live score update and స్క్రోలింగ్ లో చూసి ఆనందించాం. Indian Cricket కి కొత్త కెప్టెన్ గా, great finisher గా ధోనీ ఆవిర్భవించిన ఆ రోజుల్లోనే ఇండియాలో క్రికెట్ అనేది మెల్లగా ఎమోషనల్ side నుంచి commercial stage కి రూపాంతరం చెందటానికి ముస్తాబు అవుతుంది అని అప్పటికి ఎవరికి తెలియదు. 


2008 లో ICL కి పోటీగా IPL వచ్చింది. క్రికెట్ అభిమానుల్ని పెంచింది. జాతీయ జట్టును అభిమానించే ప్రేక్షకుల్ని ప్రాంతీయత పేరుతో విడదీసింది. తర్వాత వలస పోతున్న ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా జట్లు మార్చారు. నేను అప్పుడు ఇప్పుడు కూడా హైదరాబాద్ జట్టునే సమర్ధించాను. డెక్కన్ ఛార్జర్స్ 2009 IPL గెలవటం లో నా లాంటి అభిమానుల పాత్ర లేకపోయినా ఉందని చెప్పుకోవటానికి సిగ్గు పడను. ధోనీ తన తెలివి మరియు ధీటైన నాయకత్వం లో ఎన్నో సాధించాడు. అవన్నీ పరిచయం అక్కర్లేని విషయాలు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ కి holiday ఇచ్చారు college కి. ఆ రాత్రి గెలిచాక దీపావళి చేసుకున్నారు. మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్లిన టెస్ట్ జట్టుకి ఓపెనర్ సెహ్వాగ్ నా ద్రావిడ్ నా అనేది అర్థం అయ్యేది కాదు. తెల్లవారు ఝామున లేచి లాప్టాప్ లో match పెట్టేసరికి ఓపెనర్ సెహ్వాగ్ స్లిప్ లో దొరికిపోయేవాడు. IPL మోజులో భారత జాతీయ జట్టుకు ఆదరణ కొంచెం కొంచెం తగ్గుతూ BCCI ఖరీదైన బోర్డు గా మారి ICC ను శాసించే స్థాయికి ఎదిగింది. లలిత్ మోడీ బయట పడ్డాడు. శ్రీశాంత్ ను బయట పెట్టారు. రెండు IPL టీమ్స్ ను రెండేళ్లు ban చేశారు. వార్నర్ స్మిత్ లను రెండేళ్లు పక్కకెళ్ళి ఆడుకోమన్నారు. ఈ కాలం క్రికెట్ అభిమానులకు Circket ను మరింత దూరం చేసిన సంఘటనలు ఇవి. క్రికెట్ ను కేవలం బెట్టింగ్ game గా చిత్రీకరించిన అంశాలు కూడా అవే.

2013 నుంచి కొన్ని ఫాంటసీ అప్లికేషన్ లు బెట్టింగ్ ను కొత్త వరవడిలో లీగల్ గా చూపిస్తూ క్రికెట్ మీద ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ను కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చింది. ఈ గ్యాప్ లో 2015, 2019 ప్రపంచ కప్ లు గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే చెప్పుకునే లా అక్కడ ఏమి జరగలేదు. 2015 లో సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా మీద ఇండియా ఓడిపోయినప్పటి కంటే న్యూజిలాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళతో ఏడ్చింది. 2019 సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ మీద ధోనీ run out అవ్వగానే రాయుడు ని తీసుకోలేదని MSK ప్రసాద్ ను తిట్టిన వాళ్ళలో నేను ఒక్కడిని. 
మరి 2023 ప్రపంచ కప్ లో స్వదేశీ గడ్డ మీద అజేయంగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టి మళ్ళీ అదే న్యూజిలాండ్ మీద మ్యాచ్ ఆడబోతున్న ఈ రోజే blog ఎందుకు రాస్తున్నాను అంటే నా దగ్గర మీకు నచ్చే సమాధానం అయితే లేదు. 




మొదటి పేరా లో క్రికెట్ follow అవుతున్నావా అని నా ఫ్రెండ్ అడిగినప్పుడు నేను చెప్పిన అబద్దం ఏమిటి అంటే నేను follow అవుతున్నాను అని. నిజానికి అంత గా follow అవ్వట్లేదు. 2008 కి ముందు circket వేరు ఆ తర్వాత వేరు. IPL తర్వాత దాదాపు అన్ని దేశాల్లోనూ domestic cricket with international hybrid players బాగా సక్సెస్ అయింది. ఆయా బోర్డ్ లకి బాగా డబ్బులు తెచ్చి పెడుతుంది. కానీ ఇక్కడే క్రికెట్ దాని soul ను కోల్పోయింది అనేది నా సొంత భావన. క్రికెట్ కోల్పోయిన souls లో నాది కూడా ఉన్నది అన్నది నిజం.


Note: length ఎక్కువైంది మన్నించాలి.

-ecKce

Saturday, September 9, 2023

మా నాన్న 3

B048/Daddy/2023 dated at Podu the 09.09.T23


ఈ మధ్య బ్రో అనే సినిమా లో చూపించాడు మనిషి చనిపోయాక 90 రోజుల తర్వాత అన్ని సర్దుకుపోతాయి అని. నిజానికి మంచి కాన్సెప్టే గానీ నిజం అయితే కాదు. అదే ఒక వ్యవస్థ లో ఒక స్థానం నుంచి ఒకరు విడలితే వారి స్థానంలో మరొకరు వస్తారు కాబట్టి ప్రత్యామ్నాయం జరుగుతుంది. ఆ స్థానంలో ఎవరూ నియామకం కాకపోయినా కొన్ని పనులు ఎవరో లేరని ఎవరికోసమో ఆగవు అనేది నిజం. ఇది నేను అనుభవించాను కూడా. కానీ కుటుంబం లో అలా కుదరదు. కొన్ని పనులు కొందరు చేసినట్టు అందరూ చక్కబెట్టలేరు. నాన్న స్థానాన్ని పూరించలేరు. మా నాన్న స్థానం అయితే అసలు ససేమీరా. ఇది నేను మా నాన్న మీద ప్రేమతోనో మా నాన్న కాబట్టో చెప్తున్నా అని మీకు అనిపించవచ్చు. నిజమే మా నాన్న కాబట్టి  నాకు మాత్రమే తెలుసు. నేను భర్తీ చెయ్యలేకపోతున్నాను కాబట్టే మరింత దృఢంగా చెప్తాను. 


మా నాన్న పోయి ఈ రోజుకి 90 రోజులు పూర్తి అయినా కూడా ఎక్కడ సమస్య అక్కడే ఉంది. పైగా ఒక్కో సమస్య వైరస్ లా కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. నేనొక్కడినే ఇలా వ్యాసాలు రాయటం తప్ప ఏ పరిష్కారానికి రాలేకపోతున్నాను. శరీరానికి ఒక గాయం తగిలినప్పుడు వెంటనే పుట్టే నొప్పి ఒకటి అయితే తర్వాత వెంటాడే సలపరం ఇంకొకటి ఉంటుంది. ఇవి రెండూ కాకుండా కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే బలహీనం గా ఉన్న ఇతర శరీర భాగాలు కొన్ని క్షీణించడం మొదలవుతుంది. మా నాన్న పోయినప్పుడు గాయపడిన మా కుటుంబంలో అందరం ఆయన్ని కోల్పోయామనే సలపరంతో ఉంటుండగా బలహీనుడనైన నేను మాత్రం క్షయిస్తున్నాను. దానికి కారణం ఆయన పోవటంతో మొదలై నా బలహీనతతో బలం చేకూర్చుకుంది. 


నా పరిస్తితి ఎలా ఉంది అంటే అన్నం అందుబాటులో ఉన్నా ఆకలి తీర్చుకోలేను సరి కదా అది దానం చెయ్యాల్సిన పరిస్థితి. నేను దానం చేస్తుంటే నాకు నాకు అని ఆశగా చాచే చేతులు, తినేసేలా వెళ్ళబెట్టే నోళ్ళు, అసలు ఏం చేస్తున్నావు రా అని కోపంగా చూసే కళ్ళు. బహుశా ఇదే అనుకుంట చేసిన తప్పుకి శిక్ష అనుభవించటం అంటే. నా అమాయకత్వమే నేను చేసిన తప్పు. నేను అలా ఉండటం నాకు అనివార్యం కాదు కానీ అలా ఉండకపోవటం నాకిష్టం ఉండదు. వేరేటోళ్లని అనటం గొడవ పడటం అనేవి నేను సరదాకోసం చేస్తానేమో తప్ప ఏక్షన్ లోకి దిగటం అంటే నాకు తగని పనిగా భావిస్తాను. నా బలహీనతలను పూర్తిగా నా బాధ్యతగా స్వీకరిస్తున్నా కాబట్టే సమస్య ఇంకా సమస్యగానే ఉండిపోతుంది అని నాకు తెలుసు. 


చూస్తాను ఎన్నాళ్ళు ఇలా అనుభవించాలో. మా నాన్న నాకు విడిచిపెట్టిన లెగసీను నేను నిలబెట్టాలి అంటే నేను మా నాన్న లా ఆలోచిస్తే సరిపోదు. మా నాన్న లా ప్రవర్తించాలి. అది నాకు రావటం లేదు.


My dad may strengthen me to sort everything out.


-eckce

Wednesday, August 23, 2023

మా నాన్న 2

B047/Daddy/2023 dated at PMLanka the 23.08.T23

Simple గా చెప్పాలి అంటే నా జీవితం మా నాన్న మాతో ఉన్నప్పుడు, మమ్మల్ని విడిచి వెళ్ళిన తర్వాత గా separate చేయొచ్చు. మా నాన్న పోయిన తర్వాత నేను అందరిలాగే మామూలుగానే కనిపించవచ్చు. కానీ నాకు నేను మామూలుగా అనిపించలేను. ఎందుకంటే మా నాన్న ఒక్కరే అయినా in respect of his working ability ఆయన ఎప్పుడూ ముగ్గురితో సమానం. It's neither easy to live in his shoes nor after his shadows. ఎందుకంటే నన్ను ఆయనలాగా పెంచలేదు మా నాన్న. అందుకే ఆయన ఎలా బతికారో చూసాను కానీ ఆయనలా బతికే సాహసం చెయ్యలేదు. ఎందుకంటే అది ఆయనకే సాధ్యం. ప్రతి నాన్న గురించి ప్రతి కొడుకు ఇలాగే చెప్పొచ్చు ఏమో కానీ ప్రతి కొడుకు నాలాగా ఇబ్బంది పడడు. మా నాన్న నా సుఖమే కోరుకున్నారు కాబట్టి నాకు కష్టపడాలి అనే ఆలోచన రానివ్వలేదు. నాకున్న కొన్ని బలహీనతల్ని కూడా అర్థం చేసుకుని నన్ను బలోపేతం చేశారు కానీ నన్ను ఎప్పుడూ బలవంతం చెయ్యలేదు. నా జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకోవటం లో విఫలమైన నేను ఇలా పలు రోడ్ల కూడలి లో ఎటు వెళ్ళాలో తెలియక నిలిచి ఉన్నాను. దానికి పూర్తిగా నేనే బాధ్యుడిని. అందుకే మా నాన్న నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్ని తీసుకోలేక సతమతం అవుతున్నాను. ఆయన కష్టపడి నాకు అన్ని సమకూర్చినప్పటికీ ఆయన legacy ని కాపాడుకునే ధైర్యాన్ని మాత్రం నాకు నేర్పించలేదు ఆయన. బహుశా ఈ రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండరు. అందుకే నాకు ఏమి తెలియ చెప్పకుండానే వెళ్ళిపోయారు. 


మరణం ఆయనను చేరినప్పుడు నా గురించి ఆయనకు ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి అనే ఆలోచన నన్ను తొలిచి వేస్తుంది.


ఆయన ఎన్నో విషయాల్లో నేర్పరి. ఆయన తప్ప ఎవరు చెయ్యలేని కొన్ని చేతి పనులు ఎందరో ఆయనతో చేయించుకోవటం నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అలాగే ఆయన అమాయకత్వం లోని మంచితనాన్ని ఎందరో ఉపయోగించుకుని లాభ పడ్డారు. ఇప్పుడు ఆయన లేనప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు పొందినవన్నీ మరిచి ఇంకా అదే పంథాలో వెళ్తున్న కొందర్ని నేను ఆపలేకపోతున్నాను. అంటే అదే అమాయకత్వాన్ని నేను మోసుకుని ముందుకు వెళ్తున్నాను. 


నేనింత భారంగా రాస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆయన లాంటి ఒక వ్యక్తికి వారసుడిగా ఉండటం అంటే ఆయనకున్న శక్తిసామర్ధ్యాలు ఉండి ఉండాలి. అవి నాకు లేవు. అందులోనూ ఆయన హఠాత్తుగా నన్నొక కుటుంబ పెద్దను చేయటం ఆయన లేరన్న పుండుపై కారం లాంటిది.


-eckce

Sunday, July 16, 2023

భయపడుతూ చేసే తప్పుకే పెద్ద శిక్ష ఉంటుంది.

B046/Mistake/223 dated at PMLanka the 16.07.T23

అందరూ చెప్పేదే. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండడు. కానీ ఎంతమంది చేసిన ప్రతి తప్పుకి పశ్చాత్తాపం పడుతున్నారు? ఎంతమంది చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు? తప్పు, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. వీటికి అర్థం కూడా మనలో కొందరికి సరిగా తెలియదు. నా జీవితం లో నేను చదివి విని తెలుసుకున్న మరియు జీవితం నాకు నేర్పిన ఎన్నో పాఠాలు నాకు ఇలాంటి వాటిలో అవగాహన కలగచేసాయి. అందరికీ ఇదే అభిప్రాయం ఉండాలి అని నేను అనుకోవటం లేదు. తప్పు అనేది పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే అది తప్పా కాదా అని తీర్పు తీర్చే వారి దృష్టికి దాని ఫలితం ఆధారపడుతుంది. కానీ ఏ తప్పుకి అయినా ఇద్దరు తోడి కోడళ్ళు ఉంటారు. ఒకటి పశ్చాత్తాపం ఇంకొకటి ప్రాయశ్చిత్తం.


పశ్చాత్తాపం అంటే తప్పు చేశాను అనే అపరాధ భావం. అంటే చేసిన తప్పుని ఒప్పుకుని ఇలా చేసి ఉండకూడదు అనిపించే ఒక guilty feeling. ఇంకొక బాషలో అయితే regret అంటారు. అదే ప్రాయశ్చిత్తం అంటే చేసిన తప్పుకి మనం చెల్లించాల్సిన అపరాధ రుసుము. Compensation అన్నమాట. ఇది స్వతహాగా చేస్తే compensation, బలవంతంగా చేస్తే punishment. అదేనండి *శిక్ష*. 

నేను విన్న ఒక ఉదాహరణను ఇలా వివరిస్తే: train లో chain లాగినప్పుడో మరేదైనా తప్పు చేసినప్పుడో ప్రభుత్వం చేసుకున్న కొన్ని acts (చట్టాలు) ప్రకారం ఇలా శిక్షలు వేస్తారు. 500 రూపాయలు జరిమానా మరియు/లేదా ఒకరోజు remand. Indian Penal Code, Criminal Procedural Code లాంటి చట్టాలలో పూర్తి వివరణ ఉంటుంది ఏ తప్పుకి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది. చాలా శిక్షల్లో జరిమానా లేదా జైలు అని ఉంటుంది. తప్పు తీవ్రతను బట్టి రెండూ ఉంటాయి. 


Chain లాగిన విషయం లో chain లాగటం అనేది ఒక తప్పు. అది తప్పు అని railway వాళ్ళు శాసనాల గ్రంధం లో రాశారు. ఆ తప్పుకి శిక్ష ఏంటో కూడా రాశారు. ఆ శిక్షలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి జరిమానా, ఒకటి జైలు. మొదటిది compensation. అంటే ప్రాయశ్చిత్తం. రెండోది regret. అంటే పశ్చాత్తాపం. Chain లాగిన వాడికి అపరాధ భావం ఉందో లేదో మనకి తెలియదు గానీ వాడికి ఆ భావం కలిగించటానికి మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండటానికి ఈ ఖైదు. ఇపుడు chain లాగే తప్పులో చూపించిన శిక్షలు కేవలం ఉదాహరణ కోసం మాత్రమే చెప్పాను. ఒక తప్పుకి శిక్షలో భాగం గా రెండూ (regret and compensation) ఉంటాయి అని చెప్పటమే నా ఉద్దేశం. 


తప్పు అనేది పెద్ద సబ్జెక్ట్ అని నేను చెప్పటానికి కారణం ఏమిటి అంటే అందరూ ఈ విషయం లో ఎంతో అమాయకులుగా ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. ఎంతో మంది అలాగే తనువు చాలించారు. కొందరిలో అయినా మేల్కొలుపు కలిగించటం నా నైతికత అని భావిస్తున్నాను. 

తప్పు విషయంలో అందరూ చేసే తప్పు ఏమిటి అంటే తప్పుని కొలవటం. వారు చేసే తప్పుని చిన్న తప్పు పెద్ద తప్పు అని వేరు చేయటం. జనాలు వారికి తెలియకుండా నే తప్పుని రెండు వేరు వేరు కొలబద్ద లతో కొలుస్తున్నారు. ఒకటి తప్పు చేశాక దాని వల్ల కలిగే నష్టం యొక్క తీవ్రత ను బట్టి. రెండోది తప్పు చేశాక దానికి అనుభవించే శిక్ష యొక్క ప్రభావాన్ని బట్టి. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే ఒక తప్పు యొక్క తీవ్రతను ఎవరూ సరిగా అంచనా వేయలేరు. వారి పంచన ఉన్నంత వరకే అంచనా వేయగలరు. ఆ అంచులు దాటిన తర్వాత ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలియదు కదా. అబద్దం ఆడటం వల్ల కోర్టులో పెద్దగా శిక్ష వెయ్యరు. అలాగని అబద్దం వల్ల అనర్ధాలు జరగటం లేదా? అతి చిన్నది అనిపించే అది భయంకరమైన తప్పు అబద్దమే. దానికి ఎంతో పెద్ద ప్రమాదాన్ని తాత్కాలికంగా నిలిపి వేసే శక్తి, అలాగే పెను ప్రమాదాలు తెచ్చిపెట్టే కత్తి ఉంది. 

కాబట్టి తప్పుని తప్పుడు కొలమానంతో తిప్పి చూసి దాని తోడికోడళ్ళ తగాదాల్లో తల దూర్చకండి. తద్వారా తిప్పలు పడకండి. 

మొదట్లో ఒక మాట అన్నాను. తప్పు అనేది దాన్ని judge చేసే వారి opinion బట్టి decide చేస్తారు అని. 

తప్పుని జడ్జ్ చేసేది ముగ్గురు ప్రధాన న్యాయూర్తులు. వారు ముగ్గురు పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన వారు. కానీ కొన్నిటిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతారు.

ఒకరు మనిషి.

రెండు చట్టం.

మూడు దేవుడు. 


మనిషి తప్పును పొరపాటు అంటాడు.

చట్టం తప్పుని నేరం అంటుంది.

దేవుడు తప్పుని పాపం అంటాడు.


మనిషి కంటే చట్టం, చట్టం కంటే దేవుడు అధిక సార్వభౌముడు అనేది ఆస్తికులు అందరూ ఒప్పుకోవాలి. నాస్తికులు కూడా నమ్మాలి. 


ముందు గా చెప్పినట్టు నేను చేసేది చిన్న తప్పే గా అనుకుంటూ అపరిచితుడు చెప్పినట్టు అందరూ మెగా తప్పులే చేస్తాం. కానీ చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నామా లేదా? పోనీ శిక్షకు సిద్దంగా ఉన్నామా? శిక్షకు సిద్దంగా లేని పక్షంలో మనపై మోపబడిన తప్పుని మనం తప్పించుకోవాలి. దానికోసం మరో తప్పు చేయమని కాదు. ఇక్కడే అసలైన అందరూ మొహమాటం కొద్ది మాటి మాటికి వాడే పదం గుర్తు వస్తుంది. అదే క్షమాపణ. ఉచితంగా మన తప్పు నుంచి తప్పించుకునే మార్గం ఇది. కానీ ఇది నిజంగా జరగాలి అంటే శిక్ష పడినంత పనే జరగాలి. మనం మనస్పూర్తిగా క్షమాపణ అడగాలి. భయపడుతూ కాదు బాధ పడుతూ. ఎంత పెద్ద తప్పు చేశానో అని వివరించాలి. ముఖ్యంగా ఇంకెప్పుడు ఇలా తప్పు చెయ్యను అని ప్రమాణం చెయ్యాలి. దానికోసం స్వీయ ఒప్పందం చేసుకోవాలి. ఇది పాపం విషయంలో దేవుడి దగ్గర చేసే పవిత్రమైన పని. అలా అందరూ చేయగలగాలి. మనిషి దగ్గర కూడా చేస్తే మంచిది. 


నేను మొదట నుంచి చెప్పేది ఇదే. ఇలా ఎంతమంది చేస్తారు? నేను చెయ్యాలి అనుకుని సగం వరకు చేస్తాను. సగం మాత్రం నాకు పడ్డ శిక్షలకు, నేను పడుతున్న బాధలకు నేను ఎప్పుడు చేసిన తప్పులు కారణం అయ్యి ఉంటాయి అని వెతుక్కుంటూ ఉంటాను. నేను దేవుడే సార్వభౌముడు అని నమ్ముతాను కాబట్టి ఇంత సైద్ధాంతికత అంకురించి ఉంటాను. తప్పు అనే సబ్జెక్ట్ లో నా శాసనాల గ్రంథంలో ఉన్నత ప్రమాణాలు ఉంటాయి. అందుకే నేను చేసిన ప్రతి తప్పుకి జవాబుదరీతనం చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ తప్పులు చేయటం పూర్తిగా మానలేను. కానీ ప్రతి తప్పుకి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, శిక్ష, క్షమాపణ లాంటి మసాలాలు దట్టిస్తాను. అలా చేయని చాలా మంది ఇలా అంటుంటారు: నాకు తెలిసి నేను ఎవరికీ ఏ అన్యాయం చెయ్యలేదు కదా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. దేవుడు నన్ను చిన్న చూపు చూసాడు అని. అలా బాధ పడే వారిని చూసి నాకు చాలా బాధ వేస్తుంది. అరెరే ఏంటి ఇంత అమాయకంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో తప్పులు కూడా ఏం తప్పు చేయలేదనీ అబద్ద సాక్ష్యం చెప్తున్నారే. వీరు చేసే తప్పులన్నిటిలో ఇంకో తప్పు చేరుతుందే అని. అదే దైవ దూషణ. 


ఎందుకంటే మన జీవిత రూపకర్త ఆ సృష్టికర్త. ఆయన మనకోసం నిర్ణయించిన మార్గం లో మనం నడవలేదంటే మనం తప్పు చేసినట్టే. అప్పుడు మనం మసాలాలు దట్టించాలి లేదా ఖర్మ అనుభవించాలి. 


ఇక్కడ ఒక సందేహం రావాలి. ఎంతో మంది లోకం లో చిన్న తప్పులు అనబడే అబద్ధాలు, దొంగతనాలు చేస్తూ హాయిగా, ఓ మాదిరి తప్పులు అనబడే మోసాలు, ద్రోహులు చేస్తూ ఆస్తిపరులై ఆనందంగా, పెద్ద తప్పులు అనబడే మాన భంగాలు, హత్యలు చేస్తూ దర్జాగా ఉన్నారు. వారికి లేవా శిక్షలు అని. లేవు. నిజమే. వారికి శిక్షలు లేవు. ఎందుకంటే వారి దృష్టిలో అవి తప్పులు కాదు. వారి హక్కులు. కోడిని కోసాక ముసల్మాన్ జపా చేస్తాడు. అది అతని దృష్టిలో తెలిసి చేసిన తప్పు కాబట్టి క్షమాపణ కోరాడు. కానీ మనుషుల్ని చంపే హంతకుడు విచక్షణ కోల్పోయి ఉంటాడు. వాడికి శిక్ష పడుతుంది అని తెలిసినా దానికి భయపడడు. అది అప్పుడు అవసరం గా భావించే ఒక ఆవేదన అతడితో అలా చేయిస్తుంది. మాన భంగం చేయటం తప్పు అని తెలిసినా వాడి కామం వాడి కళ్ళు మూయిస్తుంది. ఇలా చేసిన వారు పశ్చాత్తాపం చెందలేదు అంటే వారికి అది తప్పు అనే భావన లేదు. అలాంటి వారికి భూమిపై శిక్ష లేదు. వారిని చూసి మనం జాలి పడాలి గానీ అనుకరణ అనుసరణ చేయకూడదు. నిజానికి భయపడుతూ చేసే తప్పుకే పెద్ద శిక్ష ఉంటుంది.


ప్రతి తప్పుని శ్రద్ద పెట్టి పట్టించుకోండి. తప్పులు చేయటం తగ్గించండి. తప్పుల్ని చిన్న పెద్ద అని కొలవకండి. తప్పు is తప్పు. అంతకు ముందే అసలు మీ తప్పులు ఏంటో తెలుసుకోండి. మసాలాలు దట్టించండి. జవాబుదారీతనం మంచి అలవాటు. చేసుకోండి.  

 

ముఖ్య గమనిక: సదరు సలహాలు జన హితార్థం జారీ


-eckce

Sunday, June 18, 2023

మా నాన్న - ఇక లేరు

B45/MyDaddy/2023 dated at PMLanka the 18.06.T23

Happy Fathers Day. ఈ మాట నేనెప్పుడూ మా నాన్న కి చెప్పలేదు. మా నాన్న birthday ఎప్పుడో నాకు తెలియదు. అదెప్పుడో మా నాన్నకి కూడా తెలియదు. నా birthday ఎప్పుడో మా నాన్నకి గుర్తు ఉండదు. మా అమ్మ కి గుర్తుండి నాతో మా నాన్న చేత phone మాట్లాడించినప్పుడు గానీ new year అప్పుడు గానీ మా నాన్న నాకు happy birthday అనో happy new year అనో చాలా మొహమాటం గా చెప్పటం నేను అంతే మొహమాటం తో thanks చెప్పటం మామూలే. ఇది కేవలం రెండు మూడు సార్లు జరిగింది. ఇక అలాంటి happy moments ను బలవంతం గా పంచుకునే అవకాశం మా మధ్య లేదు. దాని అర్థం మా మధ్య happy moments లేవని, ఉండవని కాదు. నాకు, మధ్యకు అవతల మా నాన్నే లేకపోయే. ఎన్నో సార్లు కొన్ని సినిమాల్లో వచ్చే తండ్రి కొడుకుల మధ్య జరిగే scenes మా నాన్నతో కలిసి చూసి నేను ఇబ్బంది గా feel అయ్యే వాడిని. ఎందుకంటే అలాంటి అనుబంధాలు ఆప్యాయతలు మేమెప్పుడూ నేరుగా పంచుకున్నది లేదు. నాకు తెలిసి చాలా మంది తండ్రి కొడుకుల మధ్య ఉండదు కూడా. కానీ మరీ మా అంత ఎడమ అయితే ఉండరేమో. ఎందుకంటే నేను మా ఇంట్లో introvert ని. మా నాన్న దగ్గర అయితే మరీను.

మా నాన్న తన చివరి శ్వాస వరకు నా కొరకే పోరాడారు. నాకోసం పైసా పైసా సంపాదించి పెట్టాలి అనుకున్నారు. పెట్టారు కూడా. కానీ నేనే నా చేతకాని తనంతో ఇంత వయసు వచ్చినా మా నాన్న కి అంది రాలేకపోయాను. నా సంపాదనతో మా నాన్న కు ఎలాంటి ముచ్చట తీర్చలేక పోయాను. అదే జరిగి ఉంటే ఇలా అర్ధాంతరంగా మా నాన్నకి కోల్పోయే వాడిని కాదు. మా అమ్మని ఇలా ఒంటరి చేసే వాడినీ కాదు. నాకు తండ్రిగా ఉండటం ఆయనకు అనివార్యం అయితే ఆయనకు కొడుకుగా ఉండటం నా అదృష్టం. 

మా నాన్న గురించి రాయటం నాకు ఇష్టం మాత్రమే కాదు. ఆయన గొప్పతనం తలచుకోకుండా ఊరక ఉండటం నేను చెయ్యకూడని నేరం అవుతుంది. ఆయన గురించి అందరితో పంచుకోవటం నా నైతిక బాధ్యత. అందులో భాగమే మా నాన్న అనే ఒక కావ్యానికి ఇది తొలి అడుగు.


నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక emotion అనటం చూసి ఏంటో అనుకున్నాను కానీ.


Sorry నాన్న.


సశేషం.


-eckce

Friday, April 14, 2023

డబ్బు కొద్దీ ప్రేమ

B44/Money/2023 dated at Tadepalligudem the 14.04.T23

అసలు మనిషి తాను బతికున్నంత సేపు దేని కోసం వెంపర్లాడతాడు? ఏదంటే ఎక్కువ ఇష్టపడతాడు? ఇలా ఒక ప్రశ్నను ఒక వంద మందిని అడిగితే అందులో అరవై మంది కంటే ఎక్కువ మంది అబద్దాలే చెప్తారు. వారికి నిజం తెలియకపోవటం కాదు దానికి కారణం. వారికి తెలిసిన నిజం చెప్పలేకే. ఎందుకంటే మనిషికి బాగా ఇష్టమైనది, కావలసింది డబ్బు, ఇంకా దానితో వచ్చే సుఖాలు. పైకి మాత్రం ప్రేమ అభిమానం అనురాగం ఆప్యాయత మనస్శాంతి మట్టిగడ్డ అని కబుర్లు చెప్తారు. నిజానికి అవే కావాలి కానీ అవన్నీ కాకపోయినా అందులో చాలా వరకు డబ్బు తో పొందగలిగినవే. ముందు డబ్బు ఉంటేనే కదా అవి ఉన్నాయో లేదో ఆలోచన వచ్చేది. అసలు డబ్బులంటూ ఉంటేనే కదా మనిషికి మనుగడ ఉండేది. డబ్బు అందరికీ కావాలి. కానీ డబ్బు అనే సరికి పైకి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అని చెప్పే వారే ఎక్కువ. అలాా చెప్పే వారు ఎవ్వరూ రేపు పోయే డబ్బేే కదా ఈ రోజు పొతే ఏంటి లే అని మనకి ఒక్క రూపాయి ఊరికే ఇవ్వరు. అంటే డబ్బు పోతుంది అంటే ఎవరు ఊరికే కావాలని పోనివ్వరు. అలాగే దాని మీద ఉన్న ఇష్టాన్ని బయటకి చూపించరు. చాలా తప్పండీ ఇది. నిజానికి డబ్బు కోసం చాలా మంది  చాలా తప్పులు చేస్తారు. అడ్డదారులు తొక్కుతారు. అబద్ధాలు చెప్తారు. మోసాలు చేస్తారు. అలా చేసే వారందరూ అబద్ధికులే. వారి దగ్గర చాలా మంది డబ్బులు పోగొట్టుకుని ఉంటారు. ఇక్కడ మోసపోయే వాడు నష్టపోతున్నాడు కానీ మోసం చేసే వాడు లాభ పడతున్నాడు. మోసం చేసే వాడు కేవలం మోసపోయిన వాడి after all స్నేహాన్ని నమ్మకాన్ని కోల్పోతే మోసపోయిన వాడు మాత్రం విలువైన డబ్బుని అది తీర్చగలిగే అవసరాలన్ని కోల్పోతున్నాడు. నిజానికి ఈ రోజుల్లో డబ్బు సంపాదించటం సులువైన పని. ఒకరిని నమ్మిస్తే చాలు. డబ్బు పోగొట్టుకోవటం కూడా ఇంకా సులువైన పని. ఒకర్ని గుడ్డిగా నమ్మేస్తే చాలు. ఇది రాస్తుంటే నా 7th క్లాస్ లో జరిగిన విషయం ఒకటి గుర్తు వస్తుంది. half-yearly Science exam లో one mark question ఒకటి అడిగారు. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏమిటి అని. దానికి answer తెలియకపోయినా ఆలోచించటానికి చాల time ఉండటం తో నేను ఇలా రాసాను: ద్రవ్యం అనగా డబ్బు. డబ్బు ఒకరి దగ్గర స్థిరంగా ఉండదు. అది ఒకరి నుంచి ఒకరి దగ్గరకు చేరుతుంది. డబ్బు యొక్క నిత్యత్వం గురించి వివరించేదే ద్రవ్య నిత్యత్వ నియమం అని ఇంకాస్త వివరిస్తూ ఐదు మార్కుల answer రాసాను. అది science exam అని తెలిసినా ద్రవ్యం అంటే డబ్బు అనే ఒక్క ఆధారం తో ఆ teacher కి పిచ్చెక్కించాను. నిజానికి ఈ సందర్భం లో ద్రవ్యం అంటే mass. ద్రవ్యరాశి లో ద్రవ్యం అన్నమాట. Law of conservation of mass states that the mass can neither be created nor be destroyed but is transformed from one form to another. ఇది ఇప్పుడు Google ఇచ్చిన result. నేను అప్పుడు రాసిన answer ఆ question వరకు wrong అయినప్పటికీ ఒక question ki మాత్రం అది correct answer. mass లాగానే డబ్బు కూడా సృష్టించబడేది కాదు. ఒకవేళ సృష్టించినా fake అంటారు. పట్టుబడే వరకే దాని చెల్లుబాటు. బుద్ధున్న వాడు ఎవడు కావాలని డబ్బుని destroy చెయ్యడు కాబట్టి అది కూడా valid ఏ. ఇంకా అసలైన పాయింట్ ఇది బదిలీ ఒకరి నుండి ఒకరికి చేయబడేది మాత్రమే. ఆ బదిలీ లోనే అసలు మజిలీ ఉంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తు వచ్చింది. రెండేళ్ళకి ముందు వరకు పది రూపాయల coin ఎక్కడ ఇచ్చినా తీసుకునే వారు కాదు. చూడగానే తీసుకోము అనేసే వారు. గట్టిగా బెదిరిస్తే వద్దని బతిమాలే వారు. అలాగే అనాదిగా చిరిగిన నోటుకు ఛీ అనిపించుకోవడం ఆనవాయితీ. అసలు ఎందుకు వారు అలాంటి చిరిగిన నోటు గాని పది రూపాయల coin గాని తీసుకోరు అంటే దానికి ఒకే ఒక్క కారణం, వారు అవి తీసుకుంటే వదిలించుకోవటం కష్టం అనుకున్నారు కాబట్టి. వారి దగ్గర ఎవరు తీసుకోరు అనే భయం వల్లనే తీసుకోరు. ఎవరికైనా ఇచ్చినపుడు వారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోరు అని వాదించి వాటిని వదిలించుకునే దమ్ము లేక తీసుకోరు. నిజానికి అంత ఓపిక లేక తీసుకోరు. అదే చిరిగినా కూడా తీసుకుంటారు అనే నమ్మకాన్ని వారికి ఇస్తే కళ్ళు మూసుకుని కళ్ళకు అద్దుకుని గుండెలకి హత్తుకుని మరీ తీసుకుంటారు. డబ్బు కదా. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. ఇక ఈ నియమం విషయానికి వస్తే డబ్బు సంపాదించటం అంటే ఒకరి దగ్గర ఉన్న డబ్బుని దోచుకోవటమే. ఆ దోచుకోవటం లో ఎంత నిబద్దత నిజాయితీ ఉన్నాయి అనేదే ముఖ్యం. ఒకప్పుడు అంటే కష్టం గాని, ఈ రోజుల్లో డబ్బు సంపాదించటం సులువయ్యింది.  

ఎంతో నిజాయితీ గా సంపాదించాను అనుకునే రోజుల నుంచి ఎంతో కష్టపడి సంపాదించా అనే రోజులు పోయి ఎంతో తెలివిగా సంపాదించా అనే రోజులు దాటి ఎంతో తొందరగా ఎంతో సులువుగా సంపాదించా అనే రోజులు నడుస్తున్నాయి. ఎందుకంటే మోసం చేసి సంపాదించే వాళ్ళు కాస్త పెరిగారు. లేదంటే సులువుగా సొమ్ము చేసుకోవటం కోసం పక్క దారి పట్టి అదే దారిలో కొట్టుకు పోయే వారు కూడా ఉన్నారు. ముందు సులువుగా సంపాదించాలి అనే అత్యాశతో మొదలు పెట్టి, పోయాక తిరిగి రాబట్టాలి అనే కసితో కొనసాగించి తర్వాత మానెయ్యలేక మితి మీరి చివరిగా పోగొట్టుకోవటం లో మజాను వెతుక్కుని పూర్తిగా నాశనం అవ్వటమే దీని ముగింపు. ఇంక అప్పులు పేరుతొ డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకోవటం లో విఫలమైన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఒకరికి డబ్బులు ఇచ్చే ముందే అవి తిరిగి రాకపోయినా మనకి ఊడేది లేదు అనుకునే దమ్ము ఉంటేనే ఇవ్వాలి అంట. మన స్థోమతకి మించి చేసే ఖర్చు ఎంత ప్రమాదకరమో మన విలాసస్థాయికి మించి జాలి పడటం ఇంకా ప్రమాదకరం. చిన్నప్పుడు రాంబాబు అనే ఫ్రెండ్ ఒకడు ఇలా అడిగాడు నన్ను. నాకు నువ్వు రేపు ఈ పని చేసి పెట్టాలి. నీ పని ఆపేసుకుని అయినా నాకు ఇది చెయ్యాలి అని. నేను ఇపుడు చాల పద్దతిగా చెప్పాను కానీ నువ్వు పస్తు ఉండైనా సరే నాకు పరమాన్నం వండి పెట్టాలి అనే రేంజ్ లో ఎదో అడిగాడు. అడుక్కునే వాడు కూడా ఇంత దర్జాగా అడగడు కదా అనిపంచింది అపుడు. సరిగా ఆలోచిస్తే మీకు కూడా ఇలాంటి వారు తగిలే ఉంటారు ఇప్పుడు కాకపోయినా కనీసం మీ చిన్నప్పుడు. ఇప్పటి వరకు నన్ను ఎంతో మంది మోసం చేశారు. అది వారి తెలివి అని ఒప్పుకోకుండా నా మంచితనం, అజాగ్రత్త అని సర్డుకుపోతూ వచ్చాను. ఇలాంటి విషయాలు చెప్పుకుంటే సిగ్గు కాబట్టి సిగ్గు విడవలేకపోతున్నాను కానీ, నన్ను మోసం చేసిన వాళ్లలో ఒక్కడికి అయినా ఆ regret ఉండి ఉంటే I might have felt happy for them. దురదృష్టవశాత్తు నేను అలాంటి భావం వాళ్లలో చూడలేదు. అప్పుడప్పుడు ఆలోచిస్తే ఇలా అనిపిస్తుంది. ఇల్లు దోచిన దొంగ అయ్యో పాపం ఈ ఇంటి వారు డబ్బు బంగారం నా వల్లే పోగొట్టుకున్నారే అని జాలి పడతాడా? అలా అనిపిస్తే దొంగతనమే చెయ్యడు కదా. అలాంటి దొంగ కంటే మన నమ్మకాన్ని, మన ప్రేమని సొమ్ము చేసుకునే అభ్యర్థుల మధ్య అభ్యంతరం లేకుండా బ్రతికేస్తున్న మనమే కదా వారి Target. ప్రతి సొమ్ము వెనక కష్టం ఉంటుంది. క్రమము కాని మార్గంలో డబ్బులు వెనకేస్తూ ఒకరి కష్టాన్ని దోచిన వాడు ఎంతో సుఖంగా నిద్రపోతున్నాడు. కోల్పోయిన వాడు మాత్రం నిద్ర లేక రోధిస్తున్నాడు. అలాంటి వాడికి కావాలి మొదటిగా చెప్పిన ప్రేమ ఆప్యాయత అనురాగం మనఃశాంతి ఇంకా మట్టిగడ్డ. కోల్పోయిన వారి జాబితాలో ఉన్నాను కాబట్టి ఇంత వాదిస్తూ వేదన చెందుతున్నాను కానీ నేను కూడా సంపాదించే వారి జట్టులో ఉండి ఉంటే ఇంత వేదాంతం వచ్చేది కాదు నాకు. నేను చేసేది తప్పు అని కూడా తెలిసేది కాదేమో. అదే కదా డబ్బు చేసే మాయాజాలం. పోగొట్టుకున్న వాడేగా ఏదైనా poetic గా చెప్పగలడు. నాలా

పోగొట్టుకున్న ప్రతి వారి తరపున కోరుతున్నా. ఇదే poetry దోచుకున్న వాడిలోను అక్రమంగా దాచుకున్న వాడిలోనూ రావాలి. మన కష్టం విలువ ఆ చమట లోని aroma వాడికి తెలియాలి.


నన్ను మోసం చేసిన వారికి నాలా మోసపోయిన వారికి ఇది అంకితం.


-eckce

Sunday, January 1, 2023

Unhappy Old Year

B43/New Year/2023 dated at Tadepalligudem the 01.01.T23

Happy New Year.

అసలు ఏ ఉద్దేశంతో ఇలా చెప్తారో తెలియదు కానీ, పుట్టిన ప్రతి వ్యక్తీ జనవరి ఒకటో తారీకున వారి జీవితంలో ఒక్కసారైనా చెప్పే మాట ఇది. మనసులో నిజంగా అలాంటి కోరిక ఉంటుందో లేదో తెలియదు కానీ ఏ రోజు గుర్తుకు రాని ప్రాణం ఆ రోజే లేచి వచ్చినట్టు కొంతమంది మనతో 364 రోజులు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ రోజు మాత్రం ఒక message పడేస్తారు మన ఫోన్ కి. మళ్ళీ మన ఫోన్ 364 రోజులు wait చెయ్యాలి వాళ్ళ నుంచి message చూడాలంటే. గత రెండు మూడు సంవత్సరాలుగా నేను అలాంటి వారికి ఎలా స్పందించాలో తెలియక ignore చేస్తున్నా ఏమో అనే భయంతో ఒకోసారి వారి message ను వెంటనే open కూడా చేయట్లేదు. 


చిన్నప్పుడు అంటే జనాలు అలవాటు చేసి ఉంటారు కాబట్టి చెప్పారు అనుకోవచ్చు. వయసు పెరిగాక కూడా అదే కొనసాగించినపుడు అందులో పరమార్థం కూడా తెలుసుకుంటే మంచిది కదా. ఈ New Year మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పటమే కదా నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే.


పోనీ వారి కోరిక (నేను Happy గా ఉండాలి అనే వారి wish) నెరవేరిందా అంటే లేదు. అందులో వాళ్ళు complete గా ఫెయిల్ అయ్యారు. 2022 జనవరి ఒకటో తేదీ నన్ను ఎంతో మంది దీవించి ఆశీర్వదించి Happy New Year చెప్పారు. కానీ నేను నా జీవితంలో చూసిన 33 New Years లో ఇదే అత్యంత అరుదైన Year. పొద్దున్నే గుమ్మం ముందు వేసే ముగ్గులాంటి రంగవల్లి ఈ సంవత్సరం నాకు. It has revealed the maximum number of colours to me that I hardly ever witnessed.


చూశారా ఇదే ఇబ్బంది. నేను అనవసరంగా మొహమాటం కొద్దీ 2022 సంవత్సరాన్ని తిడుతున్నా. తప్పెపుడు కాలానిది కాదు. అది ఆగకుండా ప్రయాణిస్తూ దాని ధర్మం సక్రమంగానే నిర్వర్తిస్తుంది. మన జీవితంలో మనకి ఎదురయ్యే అనుభవాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం వాడే ఆయుధమే కాలం. మంచి అనుభవాల్ని చెడు, చేదు అనుభవాలతో బేరీజు వేసుకుని మనం గడిపిన కాలానికి బిరుదులు ఇస్తాం. Good time, Bad time అంటూ. అది కాలం చేసిన తప్పు కాదు. మనం చేసిన తప్పుల ప్రతిఫలాల్ని అనుభవించి ఆ నిందల్ని కాలానికి ఆపాదిస్తాం అంతే. మనకి కూడా వేరే దారి లేదు. అనుభవాల్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నా వాటిని గుర్తించి వేరే వాళ్ళకి చెప్పాలి అన్నా కాలమే మనకున్న దిక్కు. కానీ అసలు నిందితులు ఎవరూ? మన పరిస్థితులే కదా. దానికి కారణం ఎవరు మనమే కదా. అంటే మనుషులమే కదా. మనం చేసిన ఖర్మల ఫలాలే కదా మనం అనుభవించేది? అంటే ఎవరు చేసిన తప్పుకు వారే అనుభవిస్తారు అనేది పొరపాటు. నువ్వు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించిన సందర్భాలు, నేను వేసిన శిక్షకి వారు నింద పడిన అనుభవాలు, వారు అనుభవించిన నిందకు వీరు నిండా మునిగిన పరిస్థితులు, వీరు మునిగిన పరిస్థితి వల్ల నువ్వు తేలిపోయిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుంది కదా. ఇదే కదా సీతాకోకచిలుక ప్రభావం. ఇదే నాకు జరిగింది 2022 లో. నా తప్పు లేదు అనను. నేనే కాదు, అనుభవించిన ఎవరూ వారి తప్పు లేదు అని చెప్పటమే పెద్ద తప్పు. ముందు అందరూ ఒకటి తప్పకుండా ఒప్పుకోవాలి. నేను మంచివాడని, నేను correct, నేనేం తప్పు చేశాను? నాకే ఇలా జరుగుతుంది అని అనుకోవటం తప్పు అని ఒప్పుకోవాలి. నిజానికి అలా అనుకోవడం వల్లే మిగిలిన వారిలో తప్పులు ఎక్కువగా దొరుకుతున్నాయి మనకి. కానీ మన అర్హతకు మించి మనం చాలా సార్లు కష్టాలు అనుభవిస్తున్నాం అని అనిపిస్తుంది. అది మాత్రం అందరు మనపై జాలి పడాల్సిన పరిస్తితి.



Sharing కి access పెరిగింది ఈ మధ్య కాబట్టి అందరూ బయట పడుతున్నారు. కానీ అందరూ ఒకేలా బయట పడుతున్నారు. గడిచిన కాలానికి మారే కాగితపు క్యాలెండర్ ను కొలమానంగా వాడి ముందేదో బాలేదు ఇపుడైనా బాగుండాలి అనే అపోహలో ఉన్నారు. గతించిన సంవత్సరం ఏదో పాఠాలు నేర్పింది అని భ్రమ పడుతున్నారు. అసలు పాఠాలు నేర్పించింది అనుకుని వెనక పాటలు పెట్టేసుకుని వాటిని స్టేటస్ లో share చేస్కోవటం latest trend ను ఫాలో అవ్వటం మాత్రమే అవుతుంది. 


అసలు ఒక ocassion ను 

ఎలా celebrate చేసుకోవాలి? పండగ వస్తే పిండి వంటలు చేసుకోవటం తెలుసు. శుభవార్త వింటే నోరు తీపి చేయటం కూడా చూశాం. కానీ అసలు ఈ December 31 రాత్రి ని ఎందుకు అందరూ ఒకేలా ప్రవర్తించరు? కొందరు మందు తాగుతారు. Cakes కోస్తారు. బిర్యానీ తింటారు. ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు. పూలు పళ్ళు స్వీట్లు ఎక్కువ rate లకు కొని waste చేస్తారు. మందుబాబులకు ఇది ఎందుకో కూడా తెలియని ఒక అనివార్య కార్యం. అసలు ఇది మన సంస్కృతి కాదు అని కొందరు గగ్గోలు పెడుతుంటే ఈ గోల ఏమిటో అర్థం కాదు. ఇది మనతో ఉన్న మనుషుల్ని ఏమార్చేందుకు ఎవడో మొదలు పెట్టిన ఆచారం. నచ్చింది అని మనం వాడేస్తున్నాం. 


నాకైతే 2022 నచ్చలేదు. 2023 మాత్రం నచ్చుతుంది అనే నమ్మకం కూడా లేదు. నాలో సరైన మార్పు లేనప్పుడు నాకు సంభవించబోయే మార్పును నేనెలా ఆశిస్తాను? అలా ఆశించే ధైర్యం చెయ్యలేని నేను మిగిలిన వారి ఆనందాన్ని ఎలా ఆకాంక్షించగలను? 


ఒకటో రెండో కాదు, ఎంతో వేదన అనుభవించాను. ఒకొక్కటి పట్టించుకుని నేను అక్కడే ఆగిపోయి ఉంటే వేరేలా ఉండేది. కానీ అన్ని మీద వేసుకుని ఆఖరికి ఎన్నో అనుభవించి ఇపుడు వాటిని మీతో చెప్పలేక మింగలేక కక్కి కక్కనట్టు ముక్కుతున్నా.


నేను ముందెప్పుడూ చూడని ఎత్తు పల్లాలు ఈ 2022 లో చూసాను. నన్ను దగ్గర నుంచి చూసిన వారికి కూడా అన్ని తెలియవు. దానికి కారణం నేనే. నేను తప్పుగా ఎంచుకున్న మనుషులు. వారిపై నేను పెంచుకున్న నమ్మకాలు. వాటి ద్వారా నేను పొందిన అవమానాలు. వాటి నుంచి నేను నేర్చుకున్న పాఠాలు. అయినా మళ్ళీ మళ్ళీ చేసిన పొరపాట్లు. ఇదొక చక్రం.


నాకు జరిగిన చిన్న ఉదాహరణ చెప్పాలి అనిపిస్తుంది. కానీ టైప్ చేసి వద్దనుకునుని మానేశాను. దాని finishing line ఏంటి అంటే don't promise than what you can afford. Don't spend than what you can earn. ఇది నాకు చిన్నప్పటి నుంచి జరిగేదే. అయినా నేను మార్చుకోలేనిది. చెప్తే నవ్వుతారు కానీ, సంవత్సరాలు మారుతున్నాయి కానీ క్యాలెండర్ వెనక నా రాశి ఫలం లో ఆదాయం కంటే వ్యయం తక్కువ ఉన్న ఒక్క సంవత్సరం కూడా నేను చూడలేదు. అవమానం కంటే రాజపూజ్యం ఎక్కువ ఉన్నప్పటికీ అదెప్పటికీ జరగకపోవడమే ఆశ్చర్యం. ఇలా contradictory ఉన్నప్పుడు అది నమ్మాలో లేదో తెలియట్లేదు. నిజానికి నమ్మను కూడా. నా దురదృష్టాన్ని 2022 సంవత్సరం మీద వేయటం భావ్యం కాదు కదా. కొన్ని నా తప్పుల వల్ల కొందరు తప్పుడు మనుషుల వల్ల నేను ఇలా రాయాల్సి వచ్చింది కానీ, otherwise అందరూ as usual అంతే ఇక. వారు happy గా ఉండటానికి అవతలి వారి ఆనందం తో పోరాడటమే జీవితం.



- EcKcE

Sunday, November 20, 2022

Picnic 🧺 A rare tour

B42/Picnic dated at Tadepalligudem the 20.11.T22


Last year ఏప్రిల్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని ఏప్రిల్ లో వచ్చే వాతావరణం మార్పులు అవి ఇచ్చే అనుభూతుల గురించి రాశాను. తర్వాత ఒక సందర్భంలో ఒక పెద్దాయన ను ఏప్రిల్ అంటే మంచి అనుభూతులు ఇచ్చే నెల కదా అని అడిగితే ఆయన ఇలా అన్నారు. ఏప్రిల్ కంటే కూడా నవంబర్ లో వచ్చే winter weather బాగుంటుంది అని. ఆయన ఉద్దేశం ఇదే అయి ఉంటుంది అనుకుని ఇలా రాస్తున్నా.

Picnic అంటే meaning తెలియని రోజుల్లో మొదటిసారి మా ఎలిమెంటరీ స్కూల్ నుంచి నవంబరు నెలలో బీచ్ కు తీసుకెళ్లారు. మూడో లేక నాలుగో తరగతి అనుకుంట. మా ఊరి పక్కనే ఉన్న ఇంకో ఊరికి నడిచి వెళ్ళాం. శివయ్య మాస్టారి ఆధ్వర్యాన స్లొగన్స్ చెప్తూ స్ట్రిక్ట్ గా road మీద నడుస్తూ వెళ్లి తోటలో కూర్చుని మళ్ళీ సాయంత్రం తిరిగి నడిచి వచ్చేశాము. అంత వరకే గుర్తు ఉన్నది. మధ్యలో ఏమి చేశామో గుర్తు లేదు. తర్వాత 2000 సంవత్సరం లో వెళ్ళాము. కొంచెం ఎక్కువ గుర్తు ఉంది ఇది. Picnic కోసం అందరి నుంచి డబ్బులు collect చేసినప్పుడు కొంత మంది ఇవ్వలేకపోయారు. ఎవరి పులిహోర వాళ్ళు తీసుకుని ఈసారి ఇంకో బీచ్ కి వెళ్ళాం. అక్కడ తోటలో రౌండ్ circle లో కూర్చుని బిస్కెట్ పాకెట్స్ snacks గా ఇస్తున్నప్పుడు కొంత మంది మేము డబ్బులు ఇవ్వలేదు సార్ అని దూరంగా ఉన్నారు. ఛ ఛ అలా ఉండకూడదు అని వాళ్ళని కూడా పిలిచి కలుపుకుని అందరూ బాగా తిని పక్కనే పెద్ద సౌండ్ setup తో వచ్చిన వేరే బ్యాచ్ లో మాయదారి మైసమ్మ, బంగాళాఖాతం లో నీరంటే నువ్వెలే పాటలు వస్తుంటే వాటికి మాలో కొందరు డాన్సులు వేసి ఏవో పాటలు పాడుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాము. 

మళ్ళీ ఆరో తరగతిలో పిక్నిక్ కి మాత్రం ఎక్కువ మంది వెళ్ళాం. ఒక మినీ లారీ రెండు రౌండ్లు వేసి అందరినీ తీసుకెళ్ళింది. పక్క ఊరి high school కావటం, ఎక్కువ మంది ముందు నుంచి పరిచయము లేని వాళ్ళు ఉండటంతో కొత్తగా ఉంది. వెళ్లగానే తోటలో కూర్చో బెట్టారు. అంత్యాక్షరి, ఇంకా ఏవో ఆటలు ఆడి భోజనం చేశాం. ఏమి తిన్నామో గుర్తు లేదు. తర్వాత బయటకు వదిలారు. అప్పుడే మా క్లాస్ లో ఉండే కాస్త posh girls అరుణ్ ఐస్ క్రీమ్స్ కొని తినటం చూసాను. అప్పట్లో మనకి అలాంటి బ్రాండ్స్ ఏమి తెలియవు. మనం ఎప్పుడు పుల్ల ఐసు, సేమియా ఐసు, కోలా ఐసు, మరీ ఎక్కువ అయితే పాల ఐసు. ఇంటికి వచ్చే ముందు ఈ సారి బీచ్ దగ్గర వరకు వెళ్లి స్నానం చేసే వాళ్ళని చూసే అవకాశం మాత్రం ఇచ్చారు. కానీ మేమేవరం నీళ్లలో దిగకూడదు. వెళ్లిన లారీ లోనే స్కూల్ కి తిరిగి వచ్చాము. అక్కడి నుంచి ఎవరి సైకిల్ వాళ్ళు వేసుకుని ఇంటికి వెళ్ళాము. ఆదివారం రోజే అలా తీసుకెళ్లేవారు లే. తర్వాత మళ్లీ వెళ్ళినపుడు మా క్లాస్ girls తో టెన్నికాయిట్ ఆడునట్టు గుర్తు ఉంది. నేను అప్పట్లో introvert గా ఉండటం వల్ల అన్ని గుర్తు లేవు. ఒకే place కి మళ్ళీ మళ్ళీ వెళ్ళటం వల్ల చేసిన పనులు కూడా confusing గా ఉన్నాయి. 

స్కూల్ లో ఉండగా తర్వాత మళ్లీ ఎప్పుడు వెళ్ళానో గుర్తు లేదు గానీ, ఇంటర్ కాలేజి లో మాత్రం ఒక చోటికి వెళ్ళాం. Place అయితే మొగల్తూరు దగ్గర అనుకుంట. ఇంటర్ ఫస్ట్ యియర్. ఇంటర్ మెమోరీస్ అనేవి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అవి గుర్తు చేసుకుంటే గానీ గుర్తు రావు. గుర్తు వస్తే మాత్రం ఆ కాసేపు అదొక వేరే ప్రపంచం. కాస్త అన్ని తెలిసి వస్తున్న వయసు. ఏ చిలిపి కళ్ళలోన కలవో అని నేను, ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో అని తాను అందరి ముందు పాటలు గా మాటలు exchange చేసుకున్న పిక్నిక్ అది. 

Next B Tech చదివే రోజుల్లో నవంబర్ కార్తీక్ మాసం లో కంటే మార్చ్ లో కేవలం ఫ్రెండ్స్ తో కలిసి అంతర్వేది కి వెళ్ళటం అలవాటు అయింది. లాంచీ లో వెళ్లి రావటం బాగుండేది. నాలుగేళ్లలో ఫైనల్ year లో మాత్రమే మూడు సార్లు అందరం కలిసి బయటకు వెళ్ళాము. అందులో ఒకటి friendship day. రెండోది farewell day. మూడోది లాస్ట్ exam అయిన next day. అప్పట్లో ఏవో emotions expressions ఉన్నా అవన్నీ పిల్ల ఛేష్టలే అనుకోవాలి. ఎందుకంటే వాటి impact ఇప్పుడు ఏమి లేదు. అలా అని ఆ emotions meaningless కూడా కాదు.

కానీ college అయిపోయాక కూడా ముందు వెళ్లిన కొన్ని places కి మళ్ళీ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవటం, పక్క వాళ్ళతో పంచుకోవటం కొత్త అనుభవాలు పెంచుకోవటం. 

ఉద్యోగం చేస్తున్న ఈ రోజుల్లో కూడా చాలా outings కి వెళ్ళినా, 2011 లో అయితే flight ఎక్కి outing కి వెళ్ళే chance miss అయింది నా వెర్రితనం వల్ల. ఇవన్నీ మరో పదేళ్ల తర్వాత జ్ఞాపకాల జాబితాలోకి వెళ్తాయి. వీటి గురించి అప్పుడు రాస్తేనే వాటి essense బయటకు తేగలం. కోల్పోయిన తర్వాతే కదా విలువ తెలిసేది. 

Picnic గురించి అనుభవాల్ని తప్ప మరేమీ రాయలేకపోతున్నాను. ఎందుకంటే అప్పట్లో ఎపుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ల గలిగె రోజుల నుంచి ఇపుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఆలోచించే రోజుల్లో ఉన్నాం. Picnic is a rare and once in a year experience. ఈ year లో ఈ season కి ఇదే అనుకుంట end.

నాలా కాకుండా గొప్ప అనుభవాలు ఇలా picnic, garden party, outing, hangout, tour, trip అంటూ రకరకాల పేర్లతో మీ అందరికీ ఉంటాయి. వాటిని మీకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ writing అనుకోండి. Get Together Reunion ప్లాన్ చేసుకునే పాత ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కి కూడా మంచి అవకాశాన్ని ఇచ్చే నెల నవంబర్ నెల. 

ఆ పెద్దాయన చెప్పినట్టు ఏప్రిల్ మాదిరే నవంబర్ కూడా కాస్త నాకు దగ్గరైన నెల. ఈ నెలలోనే నాకు దగ్గరైన వాళ్ళు కూడా పుట్టారు. 


- eckce

Monday, October 24, 2022

Diwali Diwana

 B041/Diwali dated at Tadepalligudem the 24.10.T22


చిన్నప్పుడు ఆరో తరగతి నుంచి మూడో భాష గా హిందీ తెలిసినప్పటి నుండి హిందీ లో అందరికి తెలిసిన ఒకే ఒక్క విషయం, छुट्टी पत्र తో పాటు అంతే ముఖ్యమైన వ్యాసం मेरा प्रिय त्योहार. అదేనండి దీపావళి. చిన్నప్పుడు కాబట్టి చిన్నపిల్లలకి అందరికీ ఇష్టమైన పండగ. ఆ ఒక్క రోజు కోసం మరో సంవత్సరం ఎదురు చూసే పండగ. కొత్త క్యాలెండర్ రాగానే ఏ పండగ ఎప్పుడో చూసేటప్పుడు ముందు October November కి వెళ్లి ఏ తేదీలో వచ్చిందో వెతికే పండగ.


నాకు ఊహ తెలిసిన తర్వాత నా కుర్రతనం పోయేవరకు సంవత్సరంలో నాకు బాగా నచ్చిన రోజు, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునే ఒకే ఒక్క రోజు దీపావళి రోజు. ఈ ఇష్టం అంతా కేవలం crackers కాల్చటం కోసమే సుమీ. మరో రకంగా కాదు. నేనెప్పుడూ ఎలాంటి పూజ చెయ్యలేదు. అసలు ఎందుకు జరుపుతారో కూడా తెలియదు. కానీ ఆ పండగ కోసం ఎదురు చూసి, ప్రకృతి చిహ్నం చూపాక కొన్ని రోజుల ముందు నుంచే బొమ్మ తుపాకీ లో గుండు బిళ్ళలు, తర్వాత రీళ్ళు కాల్చి, ఇంకా ఎన్నో రకాలుగా వాటిని తగలేసి ఆ శబ్దాన్ని enjoy చేస్తూ దీపావళి కి స్వాగతం చెప్పటంతో మొదలు పెట్టి ఐదో రోజు వచ్చే పాముల పండగ వరకు crackers మిగుల్చుకుని వాటికి good bye చెప్పే వరకు అంతా ఒక జాతర. ఆ జాతర అయ్యాక మళ్ళీ పలికే గోరింక పాటలో నేడే రావాలి నా దీపావళి పండగ అని పాడుకోవటమే.


ఎన్నో వింత పేర్లతో ఉండే crackers, వాటిని local గా తయారు చేయటం, కొనటం, కాల్చటం, పేల్చటం. ఉల్లిపాయ బాంబు, పెటేపికాయ, మతాబు, తూటి కర్రలో మైనం కరిగించి పోసి చేసిన కొవ్వొత్తి, ఇలా ఇపుడు గుర్తు రాని ఎన్నో హోమ్మేడ్. వాడేసిన సిరంజి సూదులతో మందు బిళ్లల్ని (తుపాకీ గుళ్ళు) గుచ్చి నేలకేసి కొట్టడం, మా కిరాణా కొట్లో ఉండే కేజీ రాళ్లతో వాటిని కొట్టడం, పట్టకారు (cutting player) లో అవి పెట్టి కొట్టడం ఇవన్నీ ఓన్మేడ్. 


అన్నట్టు నేను చిన్నప్పుడు crackers అమ్మే వాడిని. అదొక సరదా. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నేనే రాజు నేనే కూలి. మిగిలిపోయిన crackers next year వరకు అటక మీద దాచి, అపుడు మరల బయటకు తీసి ఎండలో పెట్టి, పోలీసులు ఊర్లోకి వస్తే దుప్పటితో కప్పెట్టి వాళ్ళు వెళ్ళాక తిరిగి వ్యాపారం మొదలెట్టి అబ్బో ఇలా చాలా ఏళ్ళు చేసా. ఒక సారి దీపావళి అయిపోయిన తర్వాత రోజు పొద్దున్నే ఆరు అవ్వక ముందే నిద్ర లేచి ఉబలాటం తీరని నేను ఒక పాము బాంబు (వెనక అంటించి వదిలితే ముందుకు ఎగిరేది) పేల్చా. అది మిస్ఫైర్ అయ్యింది. పైన చెప్పిన own made home made కాకుండా చేతిలో పెట్టుకుని బాంబులు పేల్చటం, ఒకేసారి ఎక్కువ crackers మంటల్లో వేయటం, తెలిసీ తెలియక కొన్ని బాంబుల్ని మొండిగా పేల్చటం ఇవన్నీ కొందరు ఆకతాయిలు చేసే ఆగడాలు. మా ఇంటి వెనక ఉట్టి కొట్టడానికి కట్టిన రెండు స్తంభాలకి ఎవరో బాంబుల దండ (చిన్న మట్టికుండలో కూర్చిన మందుతో చేసిన అవుట్లు) కట్టి పేల్చారు. అది చుస్కుకోకుండా పక్కనే ఉన్న బావి దగ్గరకు నీళ్ళ కోసం వెళ్ళిన మా అమ్మ ఆ sounds కి భయపడి పరిగెత్తుకు వచ్చింది. 


ప్రతి దీపావళి కి టీవీల్లో ఊదరకొట్టేవారు, జాగ్రత్తగా పేల్చండి అని సెలబ్రిటీ లు కూడా చెప్పేవారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వాళ్ల పిల్లలు (బాలాజీ, గాయత్రీ) అలాగే చేతులు కాల్చుకున్నారని ఆ చేతుల్ని ఫోటో ఫ్రేమ్ కట్టించి గోడకు పెట్టానని జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం నాకు గుర్తు. 2005 లో మా అక్క కొడుకు పుట్టాడు. ఆ యేడు వాడు crackers sound కి ఝడుసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అపుడు అందరినీ మేమే తిట్టుకున్నాము.


ఆ తర్వాత ఏడు నుంచి వేరే కారణాల వల్ల నేను కూడా అప్పటి వరకు చేసిన పనులన్నీ నెమ్మదిగా తగ్గించా. తర్వాత పూర్తిగా మానేశా. దీపావళి పై నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. ముందు ఉన్నంత ఉత్సాహం లేదు. దీపావళి అంటే దీపాల పండగ అనే డైలాగులు చెప్పే స్థాయి కి వెళ్ళలేదు కానీ, అంత ఆనందంగా జరుపుకునే అవసరం లేదు అని తెలిసొచ్చింది. నిన్న కార్ లో crackers shop కి వెళ్తే, అక్కడ వాళ్ళు చేసిన, మేము చూసిన హడావిడి అంతా చూసి నా చిన్నతనం గుర్తు వచ్చింది. ఈ రోజు మా పిల్లల కేరింతలు చూసి చిన్నప్పటి నేను (నిజానికి మనమంతా) గుర్తు వచ్చాను. ఏ మాటకి ఆ మాటే, చిన్నప్పుడు దీపావళి ఎందుకు జరుపుకుంటారు అనేది తెలియకపోయినా ఎలా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆనందం గా జరుపుకున్న పండగల్లో మొదటిది దీపావళి. 


One second, అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సమాధానం ఇప్పటికీ నాకు తెలియదు. తెలుసుకుందాం అన్నా answer ఒక్కటి కంటే ఎక్కువ వచ్చాయ్. కాబట్టి తెలుసుకోవాలని లేదు. చిన్నప్పుడు కేవలం బాంబులు పేల్చటంలో మాత్రమే ఆనందం దొరికేది. అంతకు మించి ఆనందం తెలియని వయసులో అది న్యాయమైనది మరియు నిజాయితీ గల ఆనందం. కానీ ఇప్పుడు అ

ఎలాంటి ఆనందం దొరక్కపోయినా ఇంకా బాంబులు పేల్చటం లోనే ఆనందం వెతకటం న్యాయం కాదు. దీపావళి అంటే దీపాల వరస అనేది అర్థం. వెలుగు నింపటం అనేది పరమార్థం. దాన్ని symbolic గా gifts, sweets ఇవ్వటం తో చూపిస్తారు. శబ్దాలతో సంబరాలు చేయటం ఆ వెలుగు నుంచి వచ్చే ఆనందానికి ఆనవాలు. మనకి వెలుగు నింపడం చేతకాకపోయినా దాని తర్వాతవి అన్ని వచ్చు. Happy Diwali అని చెప్పటం వచ్చు కానీ happy గా ఉంచటం, ఎదుటి వారి happiness చూసి నిజంగా happy గా ఉండటం రాదు. వెలుగు ఇవ్వకుండా సంబరం చేసుకోవటం అంటే చీకటిని ఇచ్చి సమరం చేయటమే. అది ఆనందం కాదు. అరాచకం. మహా పాపం. 



-eckce

Sunday, August 28, 2022

Vaseekar

 B040/Vaseekar dated at Tadepalligudem the 27.08.T22


సాగితే జ్వరం అంత సుఖం లేదంట అనే ఒక పాత సామెత ఉంది అని ఆ మధ్య ఏదో సీరియల్ లో చూస్తే తెలిసింది. సుఖం ఎలా ఉన్నా గానీ జ్వరం అనేది నా దృష్టిలో అన్ని రోగాల కన్నా పెద్దది. ఇపుడు నాకు జ్వరం లేదు కాబట్టి దాని తాలూక సంగతులు వివరించలేను గానీ జ్వరం లో ఉన్నప్పుడు ఒక రకమైన మత్తు ఉంటుంది చూడండీ. అది నేను ఇపుడు అనుభవిస్తున్నాను. మూడు రోజుల ముందు జలుబు కోసం మూడు రోజుల కోర్సు వాడిన తర్వాత కూడా తగ్గకపోతే వేరే మందుల షాప్ కెళ్ళి విషయం చెప్తే వేరే స్ట్రాంగ్ మందులు ఇస్తా అన్నాడు. సై అన్నాను. మత్తు వచ్చేవి ఇవ్వమంటారా అంటే, మత్తు వస్తే ఎలా అండి పని చెయ్యాలి కదా అన్నాను. రెండు రోజులకు ఇచ్చాడు. రెండు పూటలే వేసుకున్నా. ఎందుకంటే వాటి నిషా నషాళానికి ఎక్కింది. ఇది మూడో రోజు, ఇప్పటికీ రోజు ఉదయం తొమ్మిది వరకు మెళకువ రావట్లేదు. మధ్యాహ్నం మత్తు నిద్ర వస్తుంది. పని మధ్యలో మందేసినట్టు మైకం వస్తుంది. ఆ మెడిసిన్ ఇచ్చిన వాడి దగ్గరకు వెళ్ళి తిట్టాలన్నా బద్ధకం గానే ఉంది. ఉన్న నాలుక ఊడిపోవటానికి అప్పుడప్పుడు కొండ నాలుకకు మందు వెయ్యాల్సిందే అని అనిపించేలా చేశాడు. అసలు ఒక సమస్యకి విరుగుడు వాడినప్పుడు అది వేరే సమస్యకి దారి తియ్యటం వెనక అసలు కారణం ఏమిటో అర్థం కాదు. ఇది చాలా విషయాల్లో జరుగుతుంది. Side effects లేని మందులు చాలా తక్కువ కనిపిస్తాయి. కొంతమంది దాన్నిలా సమర్ధిస్తారు. Side effect ఉంది అంటే మందు సరిగ్గా పని చేస్తుంది అని అర్థం అంటారు.

బహుశా ఒక సమస్య ను మర్చిపోవడం కోసమే వేరే సమస్య ను తగిలిస్తారేమో. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీత ఇంకా చిన్నగా కనిపిస్తుంది కదా. నిజమే నాకు ఈ నిద్ర మత్తు సమస్య వచ్చాక నాకు జలుబు ఉందని మర్చిపోయా. ఎందుకంటే ఈ రోజు ఆవిరి పట్టగానే జలుబు తగ్గిన ఫీలింగ్ కి వచ్చేశాను. కానీ నిద్ర మత్తు పోలేదు అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో చెప్పటం కోసం, దాని విషయంలో సొమ్ము చేసుకునే అవకాశం అందరికీ అంగట్లో ఉంది ఇపుడు. కాస్త అవగాహన ఉన్న ప్రతి ఒక్కడు పరమ వైద్యుడు అనే ఫీలింగ్ లో ఉన్నాడు. వాళ్ళకి తెలిసిందల్లా Facebook post ల్లోనూ, Whatsapp స్టేటస్ ల్లోనూ, YouTube shorts లోనూ చూసిందే. ఒకప్పుడు నేను కూడా ఇలా బిల్డప్ ఇచ్చిన వాడినే కాబట్టి అలాంటి వాళ్ళని ఇపుడు easy గా కనిపెడుతున్నాను. అందరూ అశ్రద్ద చేస్తూ అకస్మాత్తుగా శ్రద్ధ చూపించేది కోల్పోయిన వారి ఆరోగ్యం మీదే కదా. మన అజాగ్రత్త కొంతమందికి వ్యాపారంగా అయింది. కానీ కాలం ఎంత మారింది అంటే అసలు పరిష్కారం లేదు అనుకున్న సమస్యలెన్నిటికో సులువైన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఈ మధ్యన. నేను 2013 నుంచి ఒక సమస్యతో పోరాటం చేస్తూ ఎంతో శ్రమించి ఎన్నో డబ్బులు తగలేసిన తర్వాత 2018 లో ఇక ఇంతేనా అనేసుకుని కూడా ఆపకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా వాటితో కానిది ఎంతో సులువుగా 2021 లో అయింది. అంటే ప్రతి సమస్యకూ ప్రతికూలత ఉంటుంది. ఆ సానుకూలత మనం సాధించాలి అంటే సంయమనం పాటించాలి. కానీ అది ఎక్కడ ఉందో వెతకాలి. సమస్య ఆరోగ్య పరమైనదైనా మానసికమైనది అయినా కూడా కొంత కోల్పోయాకే జ్ఞానం వస్తుంది. అది సమయం అయినా, సొమ్మైనా, ఇంకేమైనా. 


ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ మధ్య న్యూట్రిషియన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నారు. వారిలో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి సమాధానం ఎక్కడ పడితే అక్కడ చెప్పరు. దానికోసం ఒక చోటికి రమ్మంటారు. కావాలంటే మీరే ప్రయత్నించండి. వాళ్ళు మీకు రోడ్ మీద గానీ ఫోన్ లో గానీ ఆన్సర్ చెప్పరు. ప్రత్యేకమైన ప్రదేశానికి నేరుగా వెళ్తేనే మన సమస్య బట్టి సమాధానం చెప్తారు. కాస్త ఖరీదైన సమాధానం అది. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా ఉంటుంది సుమీ. కానీ ఇక్కడే కాస్త రహస్యం ఉంది. ఫలితం అనేది మనం ఖరీదు పెట్టి కొన్న వైద్యం వల్ల కొంత శాతమే ఉంటుంది. కానీ దానిని ఉపయోగించే పద్దతిలో కొన్ని షరతులు ఉంటాయి చూడండీ. వాటి వల్ల అధిక శాతం ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీ ఇతర సమస్యల్ని కూడా వారు అడిగి అవి మీకు లేకపోయినా గుప్పించి తెలుసుకుంటారు. వాటన్నిటికీ వాళ్ళ దగ్గర ఏవో మందులు ఉన్నాయి అని చెప్తారు. అవి మీకు ఇస్తారు. అవి సరిగా పని చెయ్యాలి అంటే మిమ్మల్ని రోజులో రెండు పూటలు భోజనం మానేయమంటారు. ఆ భోజనం స్థానంలో వాళ్ళు ఇచ్చిన మందులు భుజించాలి. పైగా మనం సహజంగా తినే కొన్ని అనారోగ్య చిరుతిండి మానేయమని చెప్తారు. అరగంట వ్యాయామం తప్పనసరి అంటారు. ఇక్కడ రహస్యం ఏమిటి అంటే మనం మానేసిన చెత్త తిండి వలన కొంత, మనం రోజులో రెండు పూటలు చేసిన లంకణం వల్ల కొంత మన శరీరం ఐడియల్ పొజిషన్ కి వస్తుంది. వ్యాయామం వల్ల బరువు  తగ్గుతారు. ఆరోగ్యం పునరుత్ధరిస్తుంది. కానీ వాళ్ళు మీరు సొమ్ము పోసి కొన్న ఆ మందుల వల్లే ఇదంతా జరిగింది అనే భ్రమను మీకు కలిగిస్తారు. దానికి మిమ్మల్ని దాసోహం అనేలా తయారు చేసి పడేస్తారు. సాధారణంగా మనకి తీరని సమస్యని కాస్త సులువైన పద్దతిలో తీర్చారు అనే కుతూహలంతో మనం కూడా బానిస అయిపోయాం వారి మందులకి. వారి వ్యాపారానికి మనమే బై ప్రొడక్ట్ అవుతాం. ఇక్కడ బాధాకరమైన సంగతేమిటి అంటే మన సమస్య శాశ్వతంగా తీరదు. అవి మానేసాక మళ్ళీ మాములే. కాబట్టి వాళ్ళకి మనం శాశ్వతమైన సరుకు గా మారిపోతాం. ఇప్పుడు నేను చెప్పినదంతా నా అనుభవం మాత్రమే. నేను చెప్పిన వాటిలో వంద శాతం నిజం లేకపోవచ్చు. కానీ వంద శాతం అబద్దం అయితే కాదు. ఇది చదివిన వారిలో ఇరు వర్గాల ప్రజలు ఉండొచ్చు. సమస్య మీది అయినప్పుడు దానికి సరైన పరిష్కారం వెతుక్కునే అవకాశం మీకే ఉంది. అది మీ హక్కు. నేను చెప్పిన వాటితో synchronize అయిన వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు అనుకుంటున్నాను. నేను కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే ఇది చెప్పట్లేదు అని అర్థం చేసుకోగలరు. మరింత వివరణకై కింద చదవండి.


సింపుల్ లాజిక్ ఏంటీ అంటే మనం ఏదైనా విషయంలో బలహీనంగా భావిస్తున్నాం అనే విషయాన్ని బయట పెట్టడమే మనం చేస్తున్న పొరపాటు. నీకొక లోపం ఉన్నప్పుడు దాన్ని నువ్వు లోపంగా కానీ సమస్యగా కానీ భావిస్తున్నట్టు ఎవరికైనా చెప్తే దాన్ని వారో వేరొకరో బలంగా మార్చుకునే అవకాశం వారికి ఇస్తున్నట్టే. నీ సమస్య అనే ఎమోషన్ వారికి weapon అవుతుంది. దానిని సరైన రీతిలో వాడి నిన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. డబ్బు లేదని, మనశ్శాంతి లేదని, శారీరక సమస్యలు ఉన్నాయని, ప్రేమ లేదని, సుఖం లేదని ఇలా నీకు లేవు అని వేటిని అయినా చూపిస్తే వాటిని నీకు ప్రత్యక్షంగానో పరోక్షం గానో ఇస్తా అని, ఇప్పిస్తా అని, రప్పిస్తా అని, అవే వచ్చేస్తాయి అని మాయ మాటలు చెప్పే మాంత్రికులు, సోదికాండ్రు, వశీకరులు, దొంగ అనే prefix చేర్చగలిగిన వైద్యులు, దైవ సేవకులు, బాబాలు, పూజారులు ఇలా ఎన్నో రూపాల్లో మన చుట్టూనే తిరుగుతున్నారు. ఇందులో ఎక్కువశాతం టీవీ ల్లోనూ, సోషల్ మీడియాలోనూ ads రూపం లో కనిపిస్తారు. వాళ్ళే డేంజర్. సులువుగా చిక్కులు పెట్టగలిగిన తాంత్రిక శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను మొసపోయినా కూడా నా వల్ల వాడు లాభ పడ్డాడు అనే ధోరణిలో బతికెయ్యగలను. కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా. మనం చేయాల్సిందల్లా మోసపోయే ముందు మన సమస్యకు తగిన పరిష్కారం మన దగ్గరే ఉంటుంది అని నమ్మటం. All the best.




-eckce

Monday, August 15, 2022

Tiranga

B039/Eckce/Flag dated at Tadepalligudem the 15.08.T22


ఒక మనిషిని అతిగా బలహీనం చేసేది అతని మానసిక భావోద్రేకం. దాని మీదే ఎన్నో సామ్రాజ్యాలు, సంస్థలు నిర్మించబడ్డాయి. శిధిలమైన చరిత్రలు పునరుద్ధరించబడ్డాయి. మనిషిని వెంటాడే ఏ భావోద్రేకపు తాలూక అనుభవమైనా (emotion) అయితే అతనిని గొప్ప వాడిని చేస్తుంది లేదా నాశనం చేస్తుంది. దాన్ని hold చేసే అతని సామర్థ్యమే నిర్ణయిస్తుంది అతని emotion యొక్క result ని.

ప్రతీ ఒక్కరికీ ఒక trigger point ఉంటుంది. ఎవరిని ఎక్కడ నొక్కితే పని జరుగుతుందో తెలిసిన వాడే రాజ్యం ఏలుతాడు అని అంటారు కదా. పొగడ్తలకు పడే వాడిని పొగడాలని, ఆశ ఉన్నవాడికి కానుకలు ఇవ్వాలని, ఏమిచ్చినా మార్చలేని వారిని ఏమార్చాలని అంటారు.


ఇక విషయానికి వస్తే 

https://www.blogger.com/u/3/blog/post/edit/5035200499168141598/5743752678499140669

ఇది నేను రాసిన మొదటి blog. నా చిన్నప్పుడు నేను ఉత్సాహంతో నా ఇంటిపై ఎగరేసిన నా జెండా కథ. ఈ రోజు దేశం అంతటా ప్రతి ఇంటిపైనా ఎగరాలి జాతీయ జెండా అంటున్నారు. జెండా కి సంబంధించిన study Vexillology చదివితే దాని యొక్క చరిత్ర, ఉనికి, విస్తరణ అన్ని తెలుస్తాయి. జెండా ను యుద్దాలు మొదలుకొని, ఒకరి పరాక్రమ స్వభావాన్ని చూపించటం, విజయనినాదం గా జయభేరి మోగిస్తు ఎగరేసే పతాకంగా ఉపయోగించేవారు. కానీ మనకి తెలిసింది జాతీయ జెండా, ప్రాంతీయ పార్టీ జెండాలు. 

జాతీయ జెండా ను దేశ స్వాతంత్ర్య కాంక్షకి మరియు జాతి సార్వభౌమత్వానికి ప్రత్యేక ప్రతీకగా రూపొందించారు. దానికి అరుదైన ప్రత్యేకత ఇచ్చి గౌరవించారు. ఒక గుడ్డ ముక్క కి ఇంత విలువ ఇవ్వటంలో జనం అపార్థం చేసుకునే విషాదమైన విషయం ఏమిటి అంటే జెండా ను గౌరవిస్తే చాలు దేశభక్తి ఉన్నట్టే అని భావించటం. ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే జెండా లో దేశాన్ని చూడాలి. దేశమును ప్రేమించాలి. దానికి ప్రతీకగా ఉన్న జెండాను గౌరవించాలి. Flag Code ను ఎలా పాటిస్తున్నామో అలాగే Fundamental Duties నీ పాటించాలి. చిహ్నాన్ని గౌరవించండి అని ఆదేశించారంటే దానికి గూడార్థం వ్యవస్థను రక్షించమని. ఆ చిహ్నం కోసం అస్తవ్యస్తం చెయ్యమని కాదు. దేశమును ప్రేమించమన్న ఆయనే దేశమంటే మనుషులు అన్నారు. మనిషిని ప్రేమించమని దానికి ప్రతీకగా ఒక చిహ్నాన్ని రూపొందిస్తే దానికోసం మనిషితో గొడవ పడటం దేశభక్తి అవ్వదుగా. 

నాకు చిన్నప్పటి నుంచీ ఒక పెద్ద doubt. సినిమాల్లో కూడా చూశాను. ప్రాంతాన్ని కాకుండా దేశాన్ని ఎక్కువగా చేసి చూపిస్తారు. అవే సినిమాలు hit అవుతాయి. అందరూ నేను ఫలానా రాష్ట్రం నుంచి వచ్చాను అని చెప్తే ఒక అమ్మాయి నాది ఇండియా అంటుంది. సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా ఇన్ని ఇండియాలు లేవు రా ఒక్కటే ఇండియా అంటారు. హాళ్ళలో వాటికే పైనుంచి చప్పట్లు కింద నుంచి ఈలలు పడతాయి, ముందు నుంచి చొక్కాలు, కాగితపు ముక్కలు ఎగురుతాయి. ఇక్కడ సామాన్య మనిషినీ బలహీనం చేసి అతని మీద బలంగా వేసిన ముద్రే దేశభక్తి. Patriotism is an emotion. అది ఒకరు trigger చెయ్యగానే bullet లా దూసుకెళ్లే బలమైన ఆయుధం.  

నాకు నా ఇల్లు అందులో మనుషులు ఇష్టం. నా వీధిలో వాళ్ళు, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం ఇలా పలు ఎల్లలు విడదీసిన ప్రతి విభజనలో ఉండే జనం అంటే సమానమైన ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అందరూ మనుషులని, రూపేణా హక్కేనా నాలో ఉన్న ప్రతి అంశం వాళ్ళకి కూడా సొంతం అని నేను నమ్ముతాను కాబట్టి. ఒక దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు, ఒక్కో రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు, అందుట్లో మండలాలు, ఊర్లు, వీధులు, ఇళ్ళు ఉన్నప్పుడు ఒకే మానవాళిలో మనం కూడా ఉన్నాం అని, ఒకే ప్రపంచంలో ఉన్న 190 పైచిలుకు దేశాల్లో మన దేశం ఒక్కటి అని మనమేమి ప్రత్యేకం కాదని ఎందుకు అనుకోము? అనుకోనక్కర్లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకమే. కానీ మనతో పాటు వాళ్ళు కూడా ప్రత్యేకమే. వాళ్ళకి కూడా దేశం దాని మీద భక్తి ఉంటాయి. ప్రపంచం అంతా రెండే రెండు నిజాల మీద నడుస్తుంది అన్నాడు ఒక సినిమా అబ్బాయి. అవే ప్రేమ మరియు స్వార్థం. ప్రేమ మాత్రమే ఉన్నప్పుడు ప్రపంచం ఒకలా ఉంటుంది. స్వార్థం వచ్చాక దేశంపై దేశం దాడికి దిగుతుంది. ఆక్రమించుకుని దోచుకుంటుంది. అదే జరిగింది దాన్నే రాజనీతి అన్నారు. దాని వల్లే అణచివేతకు ఎదురెళ్లి బానిసలు తిరుగుబాటు చేశారు. నాయకులు ఏర్పడ్డారు. స్వాతంత్య్రం కావాలి అన్నారు. త్యాగాలు చేశారు. దేశ చరిత్రలో నిలిచారు. స్వాతంత్య్రం సాధించారు. ఇది పరాయి దేశంతో పోరాడి సాధించిన స్వాతంత్య్రం.

అణచివేత, అస్పృశ్యత లాంటి దరిద్రమైన అలవాట్లన్నీ మన దేశంలో ముందు నుంచే ఉన్నా కూడా వేరే దేశం నుంచి ఎవరో దొంగలు వచ్చి అణచివేసాకే మనలో స్వాతంత్ర్య సమరయోధులు బయలు దేరారు. దానికి కారణం సమస్య యొక్క తీవ్రత. దాని వల్ల నష్టపోయిన ప్రజా సంఖ్య. 

మన దేశ సంపదైన ఒక ప్రాంతంకోసం ఇప్పుడు దేశం పక్క దేశంతో చేస్తున్న పోరాటం, మన దేశ భద్రత కోసం కొందరు తమ సాధారణ జీవితాన్ని కోల్పోయి దేశం కోసం పోరాడుతూ చేస్తున్న త్యాగం, ఇవి అవుతాయి దేశభక్తి. దేశం లోపల ఉన్న మనకి దేశభక్తి ఉంది అని చూపించటానికి ప్రతీక జెండాను మాత్రమే గౌరవించటం కాదు. దేశాన్ని గౌరవించటం. దేశాన్ని ప్రేమించటం. అంటే దేశంలోని ప్రజల్ని ప్రేమించటం. దేశంలోని ప్రజలని మాత్రమే ప్రేమించమని కాదు. మనిషిగా పుట్టిన అందరినీ ప్రేమించటం. అది నిజమైన దేశభక్తి.

ఏది ఏమైనా జెండా పండగ అంటే చిన్నప్పుడు చేసుకున్నదే. ఏడాది మొత్తం ఎదురు చూసి ఆ రోజే లడ్డు మిఠాయి తినటం, ముందు రోజు క్లాసులు లేకుండా decoration కే కేటాయించటం. మైదా పిండి తో రంగు పేపర్లు ceiling కీ గోడలకు అతికించడం. ఆటలు పాటలు పోటీల్లో గెలవటం. ఏమి తెలియకపోయినా అప్పుడే బాగా చేశాం. మొన్న ఒక ఊరిలో చూసా, దగ్గర్లో ఉన్న అన్ని schools students collaborate అయ్యి road మీద ర్యాలీ చేశారు. చిన్నప్పుడు మా elementary school వాళ్ళం పక్కనే ఉన్న UP school students తో collaborate అయిన రోజు గుర్తు వచ్చింది. ముందు సంవత్సరం academics లో 1st వచ్చిన వాళ్ళకి ప్రైజ్ లు ఇచ్చేవారు. నేను 3 years wait చేశాను ఒకవేళ నేను school 1st వస్తే నన్ను పిలిచి ఏమిస్తారా అని. నేను 10th class school 1st వచ్చినా నన్ను ఎవరూ పిలవలేదు. ప్రైజ్ ఇవ్వలేదు. కొన్ని సంవత్సాలకి తెలిసింది నాకు ఏదో ప్రైజ్ ఇచ్చారని. కానీ అది ఎవడు తన్నుకెల్లిపోయాడో ఇప్పటికీ తెలీదు. ఏమీ తెలియకపోయినా ఆ దేశభక్తిలో స్వచ్ఛత ఉండేది.

చిన్నప్పుడు దూరదర్శన్ లో వార్తలు చూసేటప్పుడు ఇండియా మ్యాప్ చూసి అదే ప్రపంచం అనుకునే వాడిని. అదే రోజుల్లో ప్రపంచపటం లో ఇండియాని చూసి shock అయ్యాను. నేను ఎంతో గొప్పగా ఇండియా ఒక్కటే ఉంటుంది అనుకుంటే దానికి మించిన పెద్ద దేశాలు ఉన్నాయి అని disappoint అయ్యాను. స్కూల్ లో ఎవరినో అడిగాను కూడా. తర్వాత realise అయ్యాను. కానీ ఈ రోజుకి కూడా realise అవ్వని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని దేశభక్తులు అని కాకుండా భక్త్స్ అని పిలుస్తున్నారు ఈ మధ్య. వాళ్ళ దృష్టిలో మనది అనే భావన మాత్రమే నిజం. ప్రపంచం మొత్తాన్ని వాళ్ళే పోషిస్తున్నట్లు ఫీల్ అవుతారు. పరాయి దేశాల్ని వారి సంస్కృతిని దూషించడం మాత్రమే వారికి ఆనందం ఇస్తుంది. అసలు మనస్సాక్షి లేని వాళ్ళు అంత మనశ్శాంతిగా ఎలా ఉండగలరు అనేది నాకు అర్థం కాదు. దేశం ఇచ్చిన కొన్ని హక్కుల్ని కూడా తప్పు పడుతూ దేశం లో ఉండాలి అంటే పరాయి దేశపు అలవాట్లని పాటించకూడదనీ అంటున్నారు. దీని వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేనప్పటికీ వాళ్ళ బలహీన భావోద్రేకాన్ని కొందరు స్వార్థపరులు తమ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు అని తెలియని అమాయక భక్తులే కానీ నిజమైన దేశభక్తులు కాదు. వాళ్ళలో చాలా మంది proud to be indian అంటారు. కానీ దాని అర్థం కూడా పూర్తిగా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆలోచించాల్సింది ఇండియాలో ఉన్నందుకు అందరూ గర్వంగా ఉండొచ్చు. కానీ ఇండియా కూడా వాళ్ళని మొస్తున్నందుకు గర్వంగా ఉండాలి కదా. 


75 సంవత్సరాల ముందు మన దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం ఒక విజయం. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అది ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి త్యాగాల్ని భావితరం పరిత్యజించకుండా కాపాడుకోవాలి. అంతే గానీ అక్కడితో అయిపోయింది అని సంబరపడిపోకూడదు. అప్పుడెప్పుడో తెల్లవాడి మీద గెలిచిన స్వాతంత్య్రం ఇప్పటికి పాతగా మారింది. తెల్లవారితే ఎన్నో విషయాల్లో ఓడిపోతూ ఉన్నాం. మరో 25 సంవత్సరాలు గడిస్తే బ్రిటిష్ పాలన లో బానిసత్వం అనుభవించిన మనుషుల ఉనికి ఎలాగూ భూమిపై ఉండదు. కానీ మనం పూర్తి స్వాతంత్య్రం తో లేమని అందరికీ తెలుసు కదా. సంకెళ్లు మారాయి కానీ బానిసత్వం కాదు. నా స్వాతంత్ర్యం దోచుకుంది మరెవరో కాదు. నువ్వే. నీ ఆలోచన విధానం. నువ్వు కోల్పోయిన నీ మంచితనం. నీలో ఏర్పడ్డ బలహీనత. మోసపోగలిగే నీ సున్నితత్వం. ఆలోచించాలని ఉన్నా ఆలోచించలేని నీ ఇంగితం. 


August 14 న పాకిస్తాన్ జెండా ఫోటో తో పాకిస్తాన్ జిందాబాద్ అని స్టేటస్ పెట్టాను. దాన్ని చూసిన 90% మంది చూసి చూడనట్టు ఉన్నారు. మిగిలిన వాళ్ళు reply ఇచ్చారు. అందులో నన్ను ఆకర్షించిన reply: చదువు ఎక్కువ అయ్యితే.. ఇలానే పనికిమాలిన ఆలోచన వస్తుంది రా. సొసైటీ లో గౌరవ హోదాలో ఉన్నందుకు..కొంతమంది కి మార్గదర్శకుడిగా ఉండాలి.. అంతేగాని.

నేను అలాగే ఉంటున్నాను అని reply ఇచ్చాను. నిజమే నేను ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాను అని నా అభిప్రాయం. పైన చెప్పినట్టు గా నాకు అందరూ ఇష్టం. నేను నమ్మిన దేవుడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు. నేను ఆటపట్టిచటానికి అబద్ధాలు చెప్తాను కానీ అబద్దాల మీద ఎక్కువ కాలం నిలవలేను. తెలిసిన మనిషి మీద సరదా కోసం జోకులు వేస్తా గానీ ద్రోహం చెయ్యాలి అనుకోను. ఇక విషయానికి వస్తే నా స్టేటస్ కి ఇంకా కొంతమంది నువ్వు ఇండియన్ వేనా అన్నారు, అందరూ ఇండియా flags పెడుతున్నారు ఎందుకు ఇపుడు contravarsy చేస్తావు అన్నారు. వాళ్ల ఎవరికి గుర్తు లేనిది ఏంటంటే ఇండియా కంటే ఒకరోజు ముందు పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం వచ్చింది అని. మనకంటే ముందే 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకల్ని చేసుకుంది. మనలాగే ఖర్చుకి వెనకాడని దేశం కాదు కాబట్టి, దాని విలువను గుర్తించారు కాబట్టి మనంతగా కాకుండా ఘనం గానే చేసుకున్నారు. నేను శుభాకాంక్షలు చెప్పాను. మనకి పరిచయం లేకపోయినా కొంతమందికి సహాయం చేస్తాం. చిన్న పిల్ల వచ్చి chocolate ఇచ్చి నా birthday అంటే God Bless You అని దీవిస్తాం. మరీ మన కంటే అమాయకులైన పాకిస్తానీ ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పటం నా తప్పు కాదు. జై హింద్ అనేది మన slogan అయితే పాకిస్తాన్ జిందాబాద్ అనేది వాళ్ల slogon. అది చెప్పటం వల్ల మన దేశం తగ్గిపోదు. పైన చెప్పినట్టు నాకు మనుషులు అంటే ప్రేమ. పాకిస్తాన్ ను పొగిడితే దేశ ద్రోహం కాదు, తిడితే దేశభక్తి కాదు అని భక్తులు అందరూ తెలుసుకోవాలి. 

ఒక మిత్రుడు నాతో చెప్పాడు: యుద్ధం నాయకుల మధ్య కానీ ప్రజల మధ్య కాదు అని. యుద్ధం నాయకుల మధ్య మాత్రమే కాదు నాయకులు మనతో చేసేది కూడా యుద్దమే. ఈ ఒక్క ముక్క పక్కాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. సంకెళ్లు ఎవరు వేశారో.



-eckce

Thursday, June 30, 2022

Fire the Fear

B038/Eckce/Corona dated at Tadepalligudem the 29.06.T22


సరిగ్గా ఏడాది కింద ఈ రోజు నాకు corona వచ్చింది. Test చేయించా కాబట్టి positive వచ్చింది లేదంటే అందరితో పాటే Kerchief తో ముక్కు తుడుసుకుని పని చేసుకునేవాడిని అనేది నా feeling. నేను test చేయించిన రోజు అసలు నాకు positive రాదు రా అని నేను, వస్తుంది wait చెయ్యరా అని నా friend ఒక పెద్ద పందెం కూడా వేసుకున్నాం. Ofcourse ఆ పందెం ఒక imaginary thing కాబట్టి సరిపోయింది. నేను ఓడిపోయాను.

అసలు corona అంటే భయమే లేదు అనుకున్న నాకు భయం పుట్టిన రోజు నన్ను భయపెట్టిన రోజు అది. సాయంత్రం phone switch off చేసి నిద్రపోయి లేచేసరికి నేను miss అయిన ఎన్నో calls. వాటితో పాటు


COVID-19 Sample Result

Patient Name

Age and Gender

Address

Contact

details మరియు

Sample Result-POSITIVE అనే SMS కూడా రావటం చూసి shock అయ్యాను. ఒకవేళ నాకు corona వస్తే నేనే status పెట్టుకుంటా అనుకునే స్థితి నుంచి నాకు corona వచ్చేసింది అనే పరిస్థితి వచ్చేసినప్పుడు నేను భయపడ్డాను. ఎవరికీ తెలియకూడదు అని భావించాను. నేను మాట్లాడే మాటల్లో కూడా భయాన్ని కనిపెట్టారు కొందరు. నేను భయపడింది రోగానికి అనారోగ్యానికి కాదు గానీ వైద్యం చేతకాని ఆరోగ్యవంతులు ఇవ్వబోయే సలహాలకి చూపించే సానుభూతికి. అయినా తెలియకుండా ఉండదు కాబట్టి ఆ పరిస్థితుల్ని అలాగే అనుభవించాను. నా అదృష్టం అప్పుడు నాతో నా భార్యా పిల్లలు లేరు. నా దురదృష్టం అప్పుడు నాకు మరెవరూ కూడా లేరు. అలాంటప్పుడు నా దగ్గరకి భయం లేకుండా వచ్చింది ఇద్దరే. అందులో ఒకడికి corona తర్వాత రోజే వచ్చేసింది. మరొకడు మాత్రం వారం రోజుల తర్వాత వచ్చి నాతో కాసేపు గడిపి ధైర్యం చెప్పి వెళ్ళాడు. అతను నాకు చెప్పిన ధైర్యం కంటే కూడా నా దగ్గరకు వచ్చిన అతని ధైర్యం నన్ను ఆకట్టుకుంది. నాకు ఒక oximeter కూడా ఇచ్చాడు. 

విచిత్రం ఏంటి ఏంటి అంటే వాళ్ళు ఇద్దరూ అన్నదమ్ములు. ఇది పక్కన పెడితే ప్రతి రోజూ నాకు phone చేసి నా బాగోగులు తెలుసుకుని నాకు practical గా జరిగేవి జరగబోయేవి వివరంగా చెప్పి నన్ను సిద్దం చేసిన నా స్నేహితుడు: వాడే నాకు positive వస్తుంది అని bet వేసిన వాడు. ప్రతిరోజూ doctor phone చేసి పలకరించడం బాగా అనిపించేది.


నాకు రెండో రోజే బిర్యానీ కూడా చేదుగా అనిపించింది. నాలుక స్పర్శ కోల్పోయింది. నాకు సాయం చేసే ఒకరిద్దరే మళ్ళీ మళ్ళీ అడిగితే కానీ ముందుకు రాకపోవటం, ఆ మొహమాటం తో వేరే వాళ్ళని సాయం అడగలేకపోవటం నన్ను ఒంటరి వాడిని చేశాయి. కావాల్సింది తినలేక చాలా ఇబ్బంది పడ్డాను. నాకైతే బయటకు వెళ్ళాలి అనిపించినా భయపడే వాడిని. రోజు రోజుకు వ్యాధి తీవ్రత పెరిగినట్టు అనిపించి పగలేదో రాత్రేదో కూడా తెలియకుండా గడిపాను. Ascoril అనే దగ్గు అరుకు తాగి సరుకు తాగిన వాడిలా నిద్ర పోయే వాడిని. ఇప్పటికీ ఆ corona మందులు almirah లో కనిపిస్తూ ఉంటాయ్. 


ఒకరోజు నేను వాడే మందులు మంచివి కాదు అని doctor వేరేవి రాస్తే అవి తెమ్మని ఒకతనికి ఈ రోజు సాయంత్రం చెప్తే ఎల్లుండి ఉదయం తెలిసిన druggist కి నేనే ఫోన్ చేసి order చెప్పి నేనే వర్షంలో తడిసి వెళ్లి తెచ్చుకుని ఇంటికి వచ్చి phone pe చేయాల్సి వచ్చేలా చేశాడు. ఆ రోజు వర్షం లో ఇంటికి వస్తూ దారిలో tiffin కొనుక్కుని phone pe చేస్తే name ఏమని వస్తుంది అన్నాడు. నేను నా పేరు చెప్పా. చాలా confident గా అది కాదు, wrong అన్నాడు. అదేంటి నా పేరు wrong అంటున్నాడు అనుకున్నా. Phone pe చేసినపుడు అతని పేరు ఏం వచ్చింది అని అడిగాడు అని తర్వాత అర్థం అయింది. 


Thermometer తీసుకుని రమ్మని చెప్తే ఒకతను online లో order చేశాడు. అది మూడు రోజుల తర్వాత వచ్చింది. అది కూడా సరిగా పని చెయ్యలేదు. 

ఏదైనా కావాలి అన్నా ఎవరో ఒకర్ని అడిగి చేయించుకునే పరిస్థితికి రావటం నన్ను కృంగదీసింది. దానికి తోడు నా వెనక మాట్లాడిన కొన్ని మాటలు నాకు తెలిసి నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. 

మనం పోరాడాల్సింది వ్యాధితో రోగితో కాదు అనే hello tune కి పరమార్థం అప్పుడే తెలిసింది. ఒకసారి కాదు లేదు అనిపించుకున్న చోట నా ఆత్మాహాన్ని దాటుకుని మళ్ళీ అడగాలంటే అది చాలా పెద్ద లేదా ముఖ్యమైన విషయం అయ్యుండాలి. 


ఈ అనుభవాలన్నీ బాధతో ఆ రోజుల్లోనే blog లో రాసేద్దాం అనిపించింది. కానీ దానికి కూడా భయపడ్డాను. ఎందుకంటే నాకున్న వ్యాధి వల్ల నా దగ్గరకు రావటానికి వాళ్ళు భయపడ్డారు ఏమో అని నేను అర్థం చేసుకున్నాను.

నన్ను నేనే నియంత్రించుకుని పదిహేను రోజులు ఒంటరిగానే గడిపాను. రోజూ phone చేసి ఇంటికి వచ్చేయ్యమని అడిగిన మా daddy అందరి కంటే గొప్పగా కనిపించారు నాకు. కానీ ఈ ఆరోగ్య కార్యకర్తలు చేసే పని తక్కువ హడావిడి ఎక్కువ. ఒక్కరోజు కూడా నాకు ఏమైనా సహాయం కావాలా అని help offer చెయ్యలేదు కానీ, ఇల్లు కదలద్దు అని orders వేసేవారు. మా పక్కింటి వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు. 


ఈ రోజు నా corona positive report status లో పెడితే చాలా మంది కంగారు పడి జాగ్రత్తలు చెప్పేశారు. ఒకే ఒక sir అయితే ఫోన్ కూడా చేశారు. Thanks to him. Report లో ఎక్కడా నా పేరు లేదు. Date కూడా 28.06.2021 అని ఉంది. అయినా POSITIVE అని నా status lo చూసి నాకోసం కంగారు పడిన వాళ్ళ అందరికీ 🙏. ఇది పాతది కాబట్టి అంత ఉత్సాహంగా share చేసాను కానీ నేను అప్పుడు మాత్రం ఎవరికీ తెలియకూడదు అనుకుని భయపడ్డానికి కారణం ఈ రోజే చూసా. నిజం కాని దానికి వచ్చిన reactions నిజానికి వస్తే ఆ reflection వేరే గా ఉంటుంది. ఆ corona దెబ్బకి ఇప్పటికీ నేను vaccine వేయించుకోలేదు.


కాలం గాయాన్ని మానుస్తుంది. అవసరం అయితే మాడ్చేస్తుంది. ఈ జ్ఞానోదయం 2009 లోనే నాకు కలిగించాడు నా స్నేహితుడు విజ్ఞాన్ కుమార్. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది wait చెయ్ అన్నాడు. కాలం సమాధానం చెప్పదు కానీ, సమాధానం కోసం వెతక్కుండా ఆపుతుంది. ఈ లోపు దాని తీవ్రత తగ్గిపోతుంది. For example నేను B.Tech చదివేటప్పుడు ప్రతి semister మా అమ్మ percentage అడిగేది. ఒక semister లో నాకు 58% వచ్చింది కానీ నేను 68% అని నీరసం గా చెప్పా. కానీ final year అయిపోగానే overal percentage ఎక్కువగానే రావటంతో అప్పుడు నిజం చెప్పేశా అప్పుడు వచ్చింది 68 కాదు 58 మాత్రమే అని. మా అమ్మ నన్ను ఏమీ అనలేదు. దానికి కారణం ఏమీ అనలేక కాదు. ఏం అన్నా అప్పుడు ఉపయోగం లేదు కాబట్టి. అప్పుడు ఉన్న తీవ్రత ఇప్పుడు లేదు కాబట్టి. ఇదే మరి కాలమే సమాధానం చెప్పటం అంటే. ఇలాంటి examples చాలానే ఉన్నాయి లే. 


ఈ రోజు ఈ corona విషయాలు రాయటానికి చాలా కారణాలు ఉన్నాయి: నాకు కూడా corona వచ్చి నా covirginity ని పోగొట్టింది అనే విషయాన్ని తెలియని వాళ్ళకి తెలియచేయటం. Corona వచ్చి ఏడాది అయింది అని జ్ఞాపకం చేసుకోవటం. ఇపుడు corona లేదు అని సంతోషించటం. నాకు కలిగిన అనుభవాల తీవ్రత ఇప్పుడు తగ్గిపోవటం (అందుకే చాలా విషయాలు గుర్తు లేవు) and finally blog రాసి చాలా రోజులు అయిపోవటం.




-Eckce

Thursday, May 12, 2022

అమ్మమ్మ డాట్ కామ్.

B037 dated at Appanaramunilanka the 11.05.T22.


ఇప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఊరిలో ఉన్నాను. చివరిగా ఇక్కడికి వచ్చింది 2018 మార్చ్ లో మా అన్నయ్య పెళ్లికి. మళ్ళీ ఈ రోజే.

మా తాతయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. కానీ మా అమ్మమ్మ, తాతయ్యలకు మా అమ్మ మాత్రమే సంతానం. కాబట్టి నాకు స్వయానా మేనమామలు లేరు కానీ మావయ్యలు, చిన్నమ్మలు, బావ, బావ మర్దిలు, మరదళ్లు ఉన్నారు.


చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులకు నేను మా అక్క మా చెల్లి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఒకసారి అయితే మా తాతయ్యకు నేను ఉత్తరం రాశాను, నాకు 51 రోజులు వేసవి సెలవులు ఇచ్చారు. మమ్మల్ని తీసుకెళ్ల టానికి మీరు రండి అని. అది చదివి వాళ్ళు నవ్వుకున్నారంట.


మా తాతయ్య వాళ్ళు గోదావరిలో వేటకు వెళ్ళి తెల్లవారుజామున పెద్ద వలలో చిన్న చిన్న చేపలు తెచ్చేవారు. మేము అరుగు మీద కూర్చుని వాటిని ఏరి మళ్ళీ అమ్మకానికి పంపటంలో సాయం చేసేవాళ్ళం. 


నాకు బాగా దగ్గరగా ఉండేది మా అక్క వయసువాడు మా బావ, మా చెల్లి వయసు వాడు మా బావమరిది. మా బావ క్లాస్మేట్ మా చిన్నమ్మ. వాళ్ళు అపుడు హై స్కూల్ లో ఒకే క్లాస్ చదివేవారు. మా బావ నన్ను సైకిల్ మీద తిప్పేవాడు. అలా ఒకసారి రోడ్ మీద వెళ్తుంటే వాళ్ల టీచర్ ఎదురయ్యారు అని మా బావ సైకిల్ దిగి గుడ్ ఈవినింగ్ చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ మర్యాద. 





అమ్మమ్మ గారి ఇల్లు నాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. నా చిన్నతనానికి వన్నె తెచ్చింది నేను అక్కడ ఉన్నన్ని రోజులే అనటంలో అతిశయోక్తి ఉన్నా అదే నిజం. 

ఒక్కొక్కటి గా చెప్పాలి అంటే కష్టం కాదు కానీ ఇష్టం వచ్చినట్టే చెప్తాను.


సీమ చింతకాయలు చాలా రుచిగా ఉండేవి. పంపర పనసకాయ పుల్లగా ఎర్రగా భలే ఉండేది. తోటలో మామిడికాయలు కోసం వెళ్ళినపుడు మా బావ అవి కలెక్టర్ కాయలు అన్నాడు: అపుడు నేను అవి కలెక్టర్ గారి చెట్ల మామిడికాయలేమో అని భ్రమ పడ్డాను.

ప్రతి సంక్రాంతికి అక్కడ పండగ బ్రహ్మాండం గా జరిగేది. మేము ఒకో సంవత్సరం వెళ్ళే వాళ్ళం. వెళ్తే మాత్రం కొత్త బట్టలేసుకుని తీర్థం (ఇప్పటికీ నేను ఆ కొట్లు ఉండే ఎగ్జిబిషన్ లాంటి వాతావరణాన్ని తీర్థం అనటం అలవాటు) వెళ్ళటం, అక్కడ పట్ట పగలే జరిగే డాన్స్ ప్రోగ్రాం చూడటం, తిరిగి తిరిగి అలసిపోయి ఏవో బొమ్మలు, పప్పలు కొనుక్కుని బుడగలతో ఆడుకుంటూ ఇంటికి రావడం. అలా ఒక సంవత్సరం అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోని కాలేజీకి టీనేజికి అనే పాటకి డాన్స్ చేస్తున్నారు అని విన్న మా బావకి పూనకాలు ఒకటే తక్కువ. అపుడు నేను కూడా ఎంజాయ్ చేశా. 


మా బావ డబ్బుల ఆట ఆడేవాడు. ఏట్లు అని ఏదో అనేవారు. ఒకడు కాయిన్ గాల్లోకి ఎగరెస్తే మిగిలిన వాళ్ళు బొమ్మ బొరుసు పందెం కాసుకోవాలి అని మాత్రం గుర్తు ఉంది. అది కరెక్టో కాదో కూడా తెలియదు. ఎందుకంటే నాకు అపుడు అర్థం అయ్యేది కాదు కూడా.


అప్పట్లో కొత్త సినిమాల్లో పాటలు పాడుకోవటం కోసం లిరిక్స్ పుస్తకాలు అమ్మేవారు. ఒక్కో సినిమా పుస్తకం ఒక్క రూపాయి. నాకు గుర్తు నేను జీన్స్, ప్రేమంటే ఇదేరా పాటల పుస్తకాలు కొనుక్కున్నాను.


మేము మలికిపురం సినిమాకి వెళ్ళే వాళ్ళం. నేను చూసిన సినిమాలు పెళ్లి, పెళ్లి చేసుకుందాం, ఏవండీ పెళ్లి చేసుకుందాం, సమరసింహారెడ్డి.పద్మజ, శంకర్ అనే థియేటర్ పేర్లు గుర్తున్నాయి.

పెళ్లి చేసుకుందాం అనే సినిమాకి ఆడాళ్ళతో కలిసి చాలామంది వెళ్ళాం. అపుడు నేను చిన్న పిల్లాడిని అని నాకు టికెట్ తీయకుండా నన్ను సినిమా హల్ లోకి తోసి తలుపు మూసేశారు. నాకు భయం వేసి ఎడ్చేసాను. అపుడు వెంకటేష్ ఎంట్రీ సీన్ లో జాగింగ్ చేస్తున్నాడు. వాళ్ళు చేసేది లేక నాకు టికెట్ తీసుకున్నారు.


ఇంకోసారి ఏదో సినిమాకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మా బావ ఒక ఐస్ ఫ్యాక్టరీ కి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవటం తో మేమే పుల్ల ఐస్ లు తీసుకుని తినేసాం. ఎవరో దూరం నుంచి అరిస్తే పారిపోయి వచ్చేశాం. 


అమ్మమ్మ గారి ఇల్లు అంటే బాగా గుర్తు వచ్చేది పసరు మందు. దాదాపు ప్రతి ఏడు నాకు మా చెల్లికి పచ్చ కామెర్లు వచ్చేవి. అపుడు మమ్మల్ని ఈ ఊరు పంపే వారు. ఎన్ని రోజులో గుర్తు లేదు కానీ, రోజూ పొద్దున్నే కళ్ళలో పసరు మందు పోసేవారు. మధ్యాహ్నం వరకు ఏడుపే. ఆ విధంగా నరకం అంటే ఏంటో చిన్నప్పుడే చూసా నేను. కళ్ళు మండుతున్నాయి అంటే బెల్లం ముక్క చేతిలో పెట్టేవారు. ఆ కొన్ని రోజులు పత్యం చెయ్యాలి. కేవలం మజ్జిగ అన్నమే తినాలి. కొన్ని చోట్ల చేతికి చురక వేస్తారు కానీ మా బ్రాండ్ మాత్రం పసరు మందే. 


అక్కడ పొద్దున్నే ఇంటింటికీ తిరిగి ఎవరో ఇడ్లీ అమ్మేవారు. స్టీల్ డబ్బాల్లో పెట్టిన ఆ వేడి ఇడ్లీ, రుచికరమైన చట్నీ అదిరిపోయేది. 



ఇంకో బంపర్ ఆఫర్ ఉంది అక్కడ. ఎక్కువ వర్షం వస్తే ఊర్లోకి వరద వస్తుంది. అలా వరద వచ్చినప్పుడు రెండు సార్లు అనుకుంట నేను అక్కడికి వెళ్ళా. ఇల్లులు అన్ని మునిగిపోతే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళటానికి అరటి బొందలతో పడవలు చేసి వాటి మీద వెళ్ళే వాళ్ళం. ఆ బురద నీటిలోనే ఈత కొట్టేవాళ్ళు.



అక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయ్. మా ఇళ్ల ముందే దున్నిన నేల మీద ఉంటాయ్ తోటలాగా. ఆ నేల ఎండ కాస్తే గడ్డ కట్టి ఉంటుంది. వాన కురిస్తే మాత్రం కుమ్మరి చేతిలో కుండ అవ్వటానికి సిద్దం. ఆ మట్టితో మేము బండ్లు, బొమ్మలు చేసుకుని ఆడుకునే వాళ్ళం. మా ఇంటికి మా బావ వాళ్ల ఇంటికి మధ్యలో ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు మూగ వాళ్ళే. వాళ్లతో ఈ బొమ్మల ఆటలు బాగా ఆడే వాళ్ళం నేను మా బామ్మర్ది. 


ఒకసారి అర్ధరాత్రి ఎవరో దీపాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగి చాలా ఇళ్లు కాలిపోయాయి. ఆ తర్వాత మంచి ఇళ్లు కట్టుకున్నారు వాళ్ళు. మా తాత గారిది మాత్రం పెంకుటిల్లు. 

వేసవిలో జ్యూస్ తాగడం కోసం 2 కిలో మీటర్ల దూరంలో ఉండే సెంటర్ కి వెళ్ళే వాళ్ళం. ఆ జ్యూస్ పాయింట్ లో ప్రేమ కథ సినిమాలో సీన్స్, పాటలు చూసిన గుర్తు. 

నువ్వు వస్తావని సినిమా లో పాటలు బాగా పాడుకునే రోజుల్లో వాలీ బాల్ ఆడే వారు అక్కడ ఎక్కువగా. నేను చూడటం మాత్రమేలే. క్రికెట్ అసలు ఎప్పుడు ఆడలేదు. 


మా బావ వాళ్ల నానమ్మ, మా అమ్మకి పెద్దమ్మ అయిన మామ్మని సంతమామ్మ అనే వాళ్ళం. ప్రతి వారం సంతకి వెళ్లి మాకు పప్పలు తెచ్చేది. మా చెల్లి అంటే బాగా ఇష్టపడేది.


ప్రతి విషయం నేను చూపించే సినిమా ఆధారాల ప్రకారం 2000 సంవత్సరానికి ముందే జరిగినట్టు అనిపిస్తుంది కదా. నిజమే 2000/2001 లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఒకరోజు అర్ధరాత్రి మా ఇంటికి ఒక కబురు రాగానే మా నాన్న మా అందరినీ లేపి సిద్దం చేసి అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాలి అని తీసుకెళ్లారు. ఇది తూరుపు గోదావరి. అంటే మధ్యలో గోదావరి దాటాలి. అలాగే దాటి వచ్చాక తెలిసింది. మా అమ్మమ్మ చనిపోయింది అని. వయసు మళ్ళి చనిపోయింది అని అనుకోక తప్పలేదు. ఆ ఏడాదే బెంగతో మా తాత చనిపోయాడు. తర్వాత స్వతహాగా ఈ ఊరితో బంధం బాంధవ్యం తెగిపోయింది. కొన్ని గొడవలు కొనసాగినా బంధం మళ్ళీ కలవలేదు. 


2006 లో సంక్రాంతికి ఒకసారి వెళ్ళాం మా బావ ఇంటికి. అప్పుడు తన ఫ్రెండ్స్ తో లక్ష్మి సినిమాకి తీసుకెళ్ళాడు. అంతే, మళ్ళీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. 


2010 లో తన పెళ్ళికి వెళ్ళాం మళ్ళీ. అమ్మమ్మ తాతయ్య లేరు, వాళ్ళు ఉన్న ఇల్లు కూడా అమ్మేసాక అక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ మా బావ మాత్రం ఏ అవసరం వచ్చినా నాకు ఎప్పుడూ తోడుగానే ఉన్నాడు. నేను తన దగ్గరకి నా ఫ్రెండ్ తో ఎన్నో సార్లు వెళ్ళాను. మా అమ్మ ఆ ఊర్లో నాకు సంబంధం చూసినా నేనే చేసుకోలేదు. 

మళ్ళీ 2018 తర్వాత 2022 లోనే మా బావమరిది పెళ్లికి ఇక్కడికి వచ్చాను. 

మంచి విషయం ఏమిటి అంటే అపుడు దేవుని కోసం కూడి మేము ప్రార్థనలు చేసేవాళ్ళం. అప్పట్లో ఉన్న ఏ ఒక్క మంచి అలవాటు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో గానీ నాలో గానీ లేదు.

ఇంకా ఎన్నో రాయాల్సి ఉన్నా నిద్ర వస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ అప్పట్లో అనుభవించిన అనుభూతులు మీరు ఎప్పుడైనా ఆస్వాదించారు అంటే సందేహం అనే అంటాను. ఎందుకంటే అవి నేను మా ఊర్లో కూడా అనుభవించలేదు. అప్పట్లో ఉండే కొన్ని అలవాట్లు ఇప్పుడు అక్కడే కాదు ఎక్కడా లేవు. 

ప్రతి ఒక్కరికీ అమ్మమ్మ గారిల్లు ఒక తీపి జ్ఞాపకమే కదా. It's an Emotion. 


-eckce.

Monday, April 25, 2022

End of the Day with Danger Signs.

B036 dated at Tadepalligudem the 25.04.T22.


365 రోజుల్లో ఆ ఒక్క రోజు. దానికి రెండు మూడు రోజుల ముందు నుంచి నేను ఒత్తిడికి లోనై ఆ రోజు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూసే రోజు. అదే ఈ రోజు. నా పుట్టిన రోజు.

నిరుడు నేను రాసిన Blog కి ఇది ముగింపు లేని కొనసాగింపు. అసలు నాకు నా పుట్టిన రోజు అంటే ఎందుకు అంత భయమో తెలియాలి అంటే దీనికి ముందు భాగం మీరు చదవాలి.


https://rajueckce.blogspot.com/2021/04/hey-birthday-its-my-wishes-to-you.html

నా ప్రతి పుట్టిన రోజుకి నాకు అసంతృప్తి ఉంటుంది. అది ప్రతి ఏటా పెరుగుతూ వస్తూనే ఉంది. ఈ సారి శిఖరాగ్రానికి చేరుకుంది. 

నాకు ఇలా పుట్టిన రోజు అని ముందుగా అందరికీ చెప్పుకోవటం ఇష్టం ఉండదు. నా పుట్టిన రోజు అని మిఠాయి పంచిపెట్టి దేవించమనే పద్దతి కూడా నచ్చదు. ఎవరికైనా గుర్తు ఉంటే ఏదో చెప్తారు. నేను కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాను. అది కూడా ఆ చెప్పే మనిషి బట్టి చెప్తాను. ఈ రోజు కూడా అలా చెప్పిన చాలామంది కి నేను ఏం చెప్పాలో తెలియక ముందు కాస్త ఆగాను. ఎందుకంటే ఒకసారి గుర్తు పెట్టుకుని చెప్పిన వాడు ఆ మరేడు గుర్తు ఉంచుకోడు. అదే నాకు నచ్చనిది. గుర్తు లేకపోగా నా మీద జాలి చూపిస్తాడు నేనేదో అడుక్కున్నట్టు. అది అసలు నచ్చదు నాకు. ఇందుకే నేను చాలా భారీగా భారాన్ని మోసే రోజు ఇదే. ఈ ఒక్క రోజూ ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా పారిపోవాలని అనిపించే రోజు. కానీ ఒక బాధ్యతాయుత స్థితిలో ఉండి అలా చేయలేక ఇలా ఉండిపోతున్నా. ముందు రోజు వరకు నా బిడ్డలు కూడా నా పుట్టిన రోజుకి హడావిడి చేస్తారు కానీ ఈ రోజు కనీసం శుభాకాక్షలు చెప్పమని వాళ్ల అమ్మ అడిగినా నాకు చెప్పరు. అదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా. ఇదేం అసలు పెద్ద విషయం కాదు. అసలు పుట్టిన రోజుకి విలువ ఇవ్వని వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను కూడా విలువ ఇవ్వను. కానీ ఇచ్చీ ఇచ్చినట్టు ఇవ్వనట్టు ఉంటూ చివరికి ఇవ్వకుండా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండటమే నా దౌర్భాగ్యం. 

Among all best friends in the world, I have THE best friends.

Among all my worse birthdays, this is my THE worst birthday.

ఎందుకంటే, ప్రతి పుట్టిన రోజు నేను depression కి మాత్రమే వెళ్తాను. ఈ సారి hospital కి కూడా వచ్చాను.

ఈ రోజు ఉదయం బాగానే గడిపేశా అనుకుని భోజనం చేసి కాసేపు నడుం వాల్చగానే ఎప్పుడూ ముద్దు ముద్దుగా మాట్లాడే నా పెద్ద బిడ్డ చెయ్యి విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలు అయింది. ఇంట్లో ఆడుకుంటూ ఎన్నోసార్లు కింద మీద పడే నా పిల్లలు ఈ రోజు కాస్త అదుపు తప్పారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ రోజు ముగిసే వరకు ఆసుపత్రిలోనే ఉండి నా కూతుర్ని రెప్ప కింద పాపలా చూసుకున్నాం. రాత్రంతా మెలకువగా ఉంటూ వెళ్ళమనే వరకూ ఇక్కడే ఉండాలి. మూడు నెలల ముందు మా నాన్నని ఇలా చుస్కున్నా. ఇప్పుడు నా పిల్లని. ఇక్కడ నేను మెచ్చుకోకుండా ఉండలేనిది నా కూతురి ధైర్యాన్ని.

ఇది తను నాకిచ్చిన పుట్టిన రోజు కానుక అనుకోవాలి. 

కొంత మంది నేను ప్రతి విషయం చాలా ఎక్కువ ఆలోచిస్తా అనుకుంటారు. కొంతమంది నేను అసలు ఏమి పట్టనట్టు ఉంటాను అనుకుంటారు. వాళ్ళకి స్పష్టీకరణ కు రావాల్సిన విషయం: నేను కూడా వాళ్ళలాగే సాధారణ మనిషిని.

నేను నా బిడ్డకు చెయ్యి విరిగింది అని స్టేటస్ పెడితే ఆక్షేపించారు ఒకరిద్దరు. ఈ రోజు నా పుట్టిన రోజు అని పెట్టుకునే వాళ్ళ కంటే ఇది కాస్త ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. 

ఇలా జరిగిందని మా నాన్నకి ఫోన్ లో చెప్తే మనకి దరిద్రం వెంటాడుతుంది అన్నారు.

మా ఆవిడ వాళ్ల అన్నకి చెప్తే పిల్లల్ని చూడకుండా ఏం చేస్తున్నారు అని తిట్టారు. ఇలా ఎవరికి వారు వారికి తోచినట్టు చెప్తూ ఉంటారు అని నాకు తెలుసు. చెప్పించుకోవటానికే కదా ఇలాంటివి జరిగేవి.

నాకిలా జరగగానే నన్ను శత్రువు గా భావించే ఇద్దరు ముగ్గురూ, నేను వాళ్ళని శత్రువుగా భావించా అని భ్రమించే అదే ఇద్దరు ముగ్గురూ, నేను నిజంగా శత్రువుగా భావించే ఆ ఒకే ఒక్కడు ఇలా అనుకోవచ్చు: బాగా జరిగింది బ్లా బ్లా బ్లా అని.

నాకు తెలిసి నేను ఎవరికీ ఏ అన్యాయం చెయ్యలేదు అంటూ డైలాగ్ లు నేను వెయ్యను. నాకు తెలుసు, మనకి అన్యాయం జరగాలి అంటే మనం ఒకరికి అన్యాయం చెయ్యనక్కర్లేదు. నీతి న్యాయాలు తప్పి చిన్న తప్పులు చేసినా చాలు, దేవుడు సరైన దారిలో నడిపించటానికి ఇలాంటి చురకలు వేస్తాడు అని. అలాంటి ఎన్నో తప్పటడుగులు నేను వేసాను. అవి ఆపటానికన్నట్టే ఇలా అయ్యింది అని నాకు అర్ధం అయింది. 

ఇది చదివే వాళ్ళే చాలా తక్కువ ఉంటారు అని తెలుసు, ఏది ఏమైనా, అలసిన మనసుతో పులిసిన శరీరంతో భారంగా రాసిన వ్యధ ఇది.ఎవరూ ప్రత్యేకంగా నొచ్చుకోవద్దు. ఇది అందరినీ కలిపి ఉద్దేశించి రాసిందే. 

చివరిగా నా విషయంలో ఏ మంచి జరిగినా అది నా పిల్లలకి, మిగిలినవి అన్నీ నాకు జరగాలి. 😧😭.

-eckce

Thursday, April 7, 2022

Powerless Tri-wing

B035 dated at Tadepalligudem the 07.04.T22


రెండు రెక్కలు ఉంటే పక్షి. మూడు/ నాలుగు రెక్కలు ఉంటే అది ఫ్యాన్. ఆ ఫ్యాన్ తిరిగినంతసేపే దానికి విలువ. అది తిరగాలంటే కావలసిన ఇంధనం లేకపోతే ఏంటి పరిస్థితి? అదే పరిస్థితి లో రెండు గంటల నుంచి ఉన్నాను. కట్టలు తెంచుకున్న కోపంతో ఉన్నాను. ఆ కోపాన్నంతా రాసే ఖాళీ గా కూడా లేను. సరిగ్గా అర్ధరాత్రి 1.19 నుంచి ఇప్పుడు 2.55 వరకు విసినకర్ర తో పిల్లలిద్దరికి విసురుతూ ఉన్నాను. కళ్ళలో నిద్ర పోయింది. చేతుల్లో జివా పోయింది. చిన్నప్పుడు ఒక జోక్ ఉండేది, గొప్ప గొప్ప నాయకులు అందరూ రాత్రి వీధి దీపాల కింద చదువుకున్నారు అంటే, ఆ నా కొడుకులు పగలంతా ఏం పీకేవారు అని. అదే పదం ఇప్పుడు వాడాలి అనిపిస్తుంది. కావాలని ఇలా అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళని లేపి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే పగటి పూట తీసుకోవచ్చు కదా.


దీని వెనక కూడా ఏదో లాజిక్ పుట్టిస్తారు ఆ ఫ్యాన్ కి ఉన్న ఫ్యాన్స్. 

అంశం మీద నిజాయితీగా స్పందించకుండా వంశం మీద నిష్కారణంగా నిందలేస్తున్నారని భావించే స్వార్ధపు సైన్యం ఉన్నంత కాలం ఈ నిరంకుశత్వాన్ని నియంత్రించలేం. కనీసం నిలదీయలేం. ఈ ఒక్క విషయమే కాదు, ఈ ఒక్క వర్గమే కాదు. అసలు లోకంలో వర్గాలు అనేవి ఉన్నంతకాలం వాళ్ళ వెనక వెర్రి సైన్యాలు వెంపర్లాడటం జరిగినంత కాలం ఇలా వంకర జీవితాలు తప్పవు.


నేను చెప్పింది సరిగ్గా అర్థం అయిందో లేదో............................................. ఇప్పుడు వచ్చింది అండీ కరెంటూ 3.05 కి. ఇలా రోజూ రెండు గంటలు తప్పదు అని బయట టాక్. ఇది కొత్తేమీ కాదు నా చిన్నప్పుడు కూడా రోజుకి రెండు గంటలు షెడ్యూల్డ్ పవర్ కట్ ఉండేది. ఒక వారం ఉదయం రెండు గంటలు, ఆ మరుసటి వారం సాయంత్రం రెండు గంటలు. అందరం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఉదయం కరెంట్ పోయే ఆదివారం మాత్రం కొంచెం బాధ పడే వాళ్ళం. ఎందుకంటే ఈ టీవీ లో వచ్చే ఏదో మంచి ప్రోగ్రాం మిస్ అయ్యే వాళ్ళం. ఇప్పట్లో లా అపుడు ఇన్వర్టర్ లు ఉండేవి కావో, అలాంటివి ఉంటాయ్ అని మాకు తెలియదో, తెలిసినా అంత స్థోమత లేదో గానీ అప్పుడు సమస్య కూడా చాలా సామరస్యంగా, అంతకంటే సామాన్యంగా ఉండేది కానీ ఇప్పటిలా ఇంత వింతగా మాత్రం ఉండేది కాదు.



నేను చెప్పింది సరిగ్గా అర్థం అయిందో లేదో................ ఉదాహరణకి కొందరు సామాన్య ప్రజలకి కొంతమంది సెలబ్రిటీలు బాగా నచ్చుతారు. చాలా మంచిది. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయి. మనం కూడా వాళ్ళ ఇష్టాల్ని గౌరవించాలి. నాక్కూడా చాలా మంది నచ్చుతారు. నా కారణాలు నాకు ఉంటాయి. నాకు ఎందుకు నచ్చారో అదే కారణం వల్ల నాకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి నచ్చరు. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయి. ఇది ఇంత వరకే ఉండాలి. అంతే కానీ నాకు నచ్చిన వాళ్ళు ఏమి చేసినా నేను వాళ్ళకి వత్తాసు పలుకుతూనే ఉండాలి అంటే అది నా సొంత వ్యక్తిత్వానికి అవమానం. ఇదే అవమానపు లక్షణాల్ని చాలా మంది తుంగలో తిక్కేస్తూ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుని ఎంతో మందిని తప్పు దోవలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, చాలా పాపం చేస్తున్నారు. నచ్చని పని చేసినపుడు నచ్చిన మనిషిని అయినా ఆ విషయంలో ఖండించాలి. నచ్చిన పని చేసినపుడు నచ్చని మనిషిని కూడా ప్రశంసించాలి. ఈ మాత్రం చేయలేకపోతే మనిషికి ఉన్న ఆలోచన అందులో ఇమిడి ఉండాల్సిన ఇంగితం గంగలో కలిసినట్టే.


ఈ మధ్య ప్రతి మనిషీ రాజకీయ నాయకుడిలాగా, ప్రజా ప్రతినిధి లాగా, సామాజిక కార్యకర్త లాగా ప్రవర్తిస్తున్నాడు. సామాన్య పౌరుడిగా మాత్రం ఉండలేకపోతున్నారు. హక్కుల్ని వినియోగించుకోలేక ఎవరో ఒకరి పక్కన నిలబడి అన్ని విషయాల్లోనూ అదే పక్షాన అదే చోట అదే పొజిషన్ లో అలాగే నిలబడి చోద్యం చూస్తూనో లేక దాన్ని ప్రోత్సహిస్తూనో కాలం గడిపేస్తున్నారు. అలా చేస్తూ కొందరు లాభం కూడా గడిస్తున్నారు. అది మంచిదే. కానీ ఎలాంటి లాభం లేకుండా ఒక అబద్ధపు ఎమోషన్ తో చిక్కు ముడిలో ఇరుక్కుని పాములాంటి పాలకులకి పావుల్లా వాడబడుతూ ఉంటున్న దేశీ పావురాలకి పూర్వం నుంచి పెద్దలు చెప్తూ వచ్చేది ఏంటి అంటే: నీ వ్యక్తిగత జీవితానికి పైన ఒక వలయం గీసి దాని వల్లే నువ్వు ఇంకా జీవించి ఉన్నావని నిన్ను భ్రమకి గురి చేసి నిన్ను ప్రభావితం చేస్తున వాళ్ళ అంతర్యామి నీకు అంతుపట్టనంత కాలం సొంతం అనుకున్న నీదంతా కోల్పోతూనే ఉంటావు.


దేశం కోసం ధర్మ కోసం ఒక సైనికుడిగా పోరాడటానికి నీ దేశం ఇంకా ఎవరి చేతుల్లోనో బందీ గా లేదు. నువ్వే కొందరి చేతల్లో బందీ గా ఉన్నావు. నీ ధర్మం ఎవరి దాన ధర్మాల మీద ఆధారపడి లేదు. నువు చేసే ధర్మమే నిన్ను కాపాడుతుంది.

వ్యక్తి పూజ, వర్గ భజన కంటే

నీ కుటుంబం కోసం నువు చేసే కృషి మాత్రమే నీకు అన్నిటి కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. 



చివరిగా ఒక్క మాట: ఎవడెన్ని కారణాలు చెప్పినా, అర్ధరాత్రి ఇలా కరెంట్ తియ్యటం తప్పు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. 


-eckce 

Sunday, December 12, 2021

The Day of Death

B034 dated at Tadepalligudem the 12.12.T21


ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని ఒక జ్ఞాని అన్నారు. బతుకంతా ఏడుపుగొట్టుదే అనే సంకేతంతో మాటలు నేర్చుకునే ముందే ఏడుపు చేర్చుకుని పుడతాం. ఎవరైనా ఏడిపించే వరకు నవ్వుతూ ఉండే వయసు నుంచి ఎవరో ఒకరు నవ్విస్తే గాని నవ్వలేని వయసు వరకు జీవితం అంతా మల్లయుద్ధమే. ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రత్యర్థి వ్యక్తిత్వంతో పోటీ పడుతూ పడి లేస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో తనతో తానే వైరం పెంచుకుంటాడు. బ్రతకడం కోసం చస్తూ ఉండే జీవితం గడుపుతూ పరిస్థితికి తగ్గ భావాల్ని బయటకి పలికిస్తూ లోపల ఏడుస్తూనే ఉంటాడు.

మొదట చెప్పిన మాట విషయానికొస్తే కొన్ని ఎన్నటికీ మారవు అనుకుని కూడా మారిపోయిన కొన్నిటిలో ఒకటి చావుకి మనం ఇచ్చే విలువ. చావుకి విలువ ఇవ్వటం అంటే అర్థం బ్రతుక్కి విలువ ఇవ్వటమే. బ్రతుక్కి విలువ ఇస్తేనే చావు కి మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. ఒకరు బ్రతికిన ఒరిజినల్ బ్రతుకంతా బట్టబయలు అయ్యేది ఆ ఒకరు చనిపోయిన తర్వాతే. జీవం ఉన్నంత కాలం ఎన్ని జోకులేసినా అది పోయినాకే జీవితం గురించి మాట్లాడతారు. బ్రతికున్నంత వరకు వారి గొప్పతనాన్ని ఎరుగని లోకం చనిపోయాక మాత్రం ఆకాశానికి ఎత్తేస్తుంది. అదే మరణం యొక్క విలువ. బ్రతికినంతకాలం గుర్తింపు ఆశించకుండా పని చేయగలిగిన వారినే ప్రపంచం వారు పోయిన తర్వాత గుర్తిస్తుంది.

బ్రతికున్నంతకాలం పుట్టినరోజు జ్ఞప్తి చేసుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ చనిపోయాక కూడా వారి జయంతిని వర్ధంతిని జ్ఞప్తి చేసుకునే మనసుల్ని గెలిచిన బ్రతుకు బ్రతికినవారు ఎందరో.

ఒకరు మనకి గుర్తు ఉండాలి అంటే వారి పరిచయం మనతో ఉండాలి. లేకపోతే వారి ప్రభావం అయినా మన మీద ఉండాలి. అలా ఉండాలి అంటే వారు చాలా గొప్పవారు అయ్యి ఉండాలి, లేదంటే చెడ్డవారు అయినా ఉండాలి. అదీ కాదంటే ఎవరైనా వారి గురించి బలవంతంగా మనలోనికి చొచ్చి ఉండాలి. ఈ బలవంతపు చొచ్చింపు వల్ల మనం ఎందరో వ్యక్తులకి సాధారణ అభిమానులుగా ఉన్నాం. వారి జనన మరణ నమోదు మనలో ముద్రించబడింది.

కానీ కొందరు మాత్రం మన సొంత అనుభవ అభిప్రాయపు అభిమానం లోనుంచి ఆవిర్భవిస్తారు. వారు మరణించినా మన మనసుల్లో జీవించే ఉంటారు. ప్రతి రోజు కాకపోయినా వారు పంచిన జ్ఞాపకాల ఆనవాళ్లు మళ్ళీ ఎదురైతే వాళ్లే గుర్తొస్తారు.

కుటుంబంలో వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, కొంచమే పరిచయం ఉన్నా మంచి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు.

శత్రువు కూడా చచ్చాక మనకి ఏదో మూల జాలి కలుగుతుంది అయ్యో పోయాడే అని. వీడు చస్తే దరిద్రం పోతుంది అని మాటల్లో అన్నప్పటికీ మనసులో మాత్రం అలా ఎవరం అనుకోము సాధారణంగా. 

ఎందుకంటే శత్రువు మీద గెలవాలి అనుకోవటం యుద్ధం అవుతుంది కానీ శత్రువు చావాలి అనుకుంటే అది పైశాచికం అవుతుంది కదా. కానీ చేసిన చిన్న మోసానికే, జరిగిన కొంత అన్యాయానికే శత్రువు కాళ్ళు చేతులు పడిపోవాలి, ఉసురు తగలాలి, అడుక్కు తినే పరిస్థితి రావాలి అని కోరుకుంటూ, చనిపోయిన తర్వాత కూడా కుక్క చావు చచ్చాడు అని ఆనందపడే వ్యక్తుల్ని నేను దగ్గర నుంచి చూసాను. అలాంటి వాళ్ళ గురించి ఒకటే మాట అనగలం. వాళ్ళ మనస్తత్వమే చెప్తుంది వాళ్లకి అలా అనుకోవాల్సిన పరిస్థితి రావటానికి కారణం.

ఇక మనతో ఉంటూ మనల్ని విడిచి ఎందరో వెళ్లిపోయారు. పోయిన మన పూర్వీకులే ఇందుకు సాక్ష్యం. ఇంకా వెళ్ళిపోతారు. వయసుమళ్లి కాటికి కాళ్ళు చాపిన ముసలితనమే నిదర్శనం. తర్వాత మనం కూడా వెళ్లిపోతాం. ఎందుకంటే అందరి చివరి గమ్యం మరణమే. ఇది అందరికీ జరిగేదే. అలా వెళ్లిపోయిన చాలా మందిని తొందరగానే మర్చిపోయేలా బిజీ జీవితం మనకి ఉండటం కూడా అందరకీ జరిగేదే. పోయిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి అని కొందరు అనుకుంటారు, పోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని బాధపడకూడదు, జ్ఞాపకం చేసి మిగిలిన వాళ్ళని బాధపెట్టకూడదు అని కొందరు భావిస్తారు. ఈ రోజుల్లో అయితే ఒకరు పోయారు అనగానే అయ్యో అనటం కూడా మానేసి అవునా అంటున్నారు. మనలో చాలా మందికి చావు పలకరింపును కూడా హ్యాండిల్ చెయ్యటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కొందరి చావుల్ని నిర్లక్ష్యం చేసి ఉంటాం కూడా. అది మనం మరణానికి విలువ ఇచ్చినట్టా ఇవ్వనట్టా అనేదానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. కొంతమంది అయితే చావు గురించి మాట్లాడటం కూడా నేరం, పాపం, అపశకునం అంటారు. మాట్లాడినప్పుడు మన నోరు కూడా మూసేస్తారు వాళ్ళ చేతుల్తో. అదేంటో, తథాస్తు దేవతల భక్తులేమో వాళ్ళు. సినిమాల ప్రభావం కూడా సగం కారణమే. ఇది చదువుతూ కూడా అలా భావించే వాళ్ళు ఉండరు అనుకుంటున్నా.

తప్పకుండా జరిగేది, ఎవరూ తప్పించలేనిది, ఎక్కువ మందిని భయపెట్టేది అయిన ఒక విషయం గురించి మాట్లాడుకోవడం తప్పేమీ కాదు. నిజానికి ఇపుడు అవసరం అనిపించింది. మన భవిష్యత్తు, పెళ్లి, పిల్లలు ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు మన చావుని కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ఎప్పుడు, ఎలా అనేది చెయ్యకూడదు. అలా చేస్తే నేరం.  

మూత పెట్టి దాచి పెట్టిన రసాయనం బయటకి వచ్చే వరకు సీసాలో ఎంత భద్రంగా ఉంటుందో మూత తీసి బయటకి తెచ్చిన తర్వాత ఎంత ఉపయోగకరంగా పనిచేస్తుందో అలాగే సీసా అనే బ్రతుకులో మూత అనే చావు యొక్క భద్రతలో రసాయనం అనే  వ్యక్తిత్వంగా ఉన్నాము.

ప్రతి రసాయనానికి ప్రాధమిక కర్తవ్యం ఉన్నట్టే ప్రతి జీవికి ఉంటుంది. మనిషికి ఉన్న కొన్ని ప్రాథమిక కర్తవ్యాల్లో ఒకటి మనిషిగా బ్రతకడం. అది ఒక్కటి చేస్తే చాలు. మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండటానికి. అలా బ్రతికిన వాడే మా దుర్గా ప్రసాద్. 

పుట్టి 31 సంవత్సరాలే అయింది. కానీ చనిపోయి 2 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా మా అనుభవాల్లో జీవించే ఉన్నాడు. ఒక రోజు వ్యత్యాసంలో తన జనన మరణాల్ని ధృవీకరించుకుని మా మధ్య ఒక వెలుగు వెలిగిన ధ్రువ తార.

(11.12.1990 - 12.12.2019)

అతని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా రాయటం కాదు కానీ అతని మరణదినాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా అతను గడిపిన జీవితాన్ని స్మరించుకునే సందర్భంలో భాగమే ఇది.

Life is a memory and his memories are with us.

DP lives on....


-eckce

Sunday, September 26, 2021

ఆలోచిస్తే అతిశయమే

B033 dated at Tadepalligudem the 26.09.T21

అత్యంత ఇబ్బందికర విషయం ఏమిటి అంటే నేను ఒకలా ఉండాలి అనుకుని అలా ఉండలేకపోవటం, అందుకు నేనే మళ్ళీ బాధ పడటం. నా అవగాహన బట్టి  నాకు నేనే కొన్ని పరిమితులు పెట్టుకుని వాటికి తగ్గట్టు మసులుకోవాలి అనే షరతుల్లో ఉండాలి అనుకుంటా కానీ నేనే వాటి పరిధిని దాటి నాకు నచ్చని రీతిలో దారి తీరు లేకుండా ఏడుస్తూ ఉంటా. ఇదే మిగతా వాళ్ళకి నాకు తేడా లేకుండా చేస్తుంది అనే బాధ అస్తమాను వెంటాడుతుంది. 

స్వీయకృతాపరాధభావం ఉన్నా కూడా స్వతహాగా ఉన్న తప్పుడు స్వభావం వల్ల మళ్ళీ మళ్ళీ అవే తప్పుడు దారుల్లో నన్ను నడిపిస్తూ వేధిస్తున్న ఆలోచనలు నన్ను కెలికేస్తున్నాయ్.


ఏది అసలైన తృప్తిని ఇస్తుందో తెలియదో లేక ఏది ఉంటే అసలు తృప్తి వస్తుందో తెలియదో గాని ఏది ఉన్నా ఏ తృప్తి లేదు అనిపిస్తుంది. అసలు ఏదీ లేని వాడి పని బాగుంటుందేమో అనిపిస్తుంది. నిజంగా ఒకసారి ఆలోచించాలి అసలు ఏది ఉంటే ఏ బాధ లేకుండా ఉండొచ్చు అనేది. సరదాగా ఇప్పుడే చూద్దాం. ఫుల్లుగా డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఫుల్ గా డబ్బులు ఉండే కంటే ఫుల్ గా డబ్బులు వస్తూ ఉంటూ అప్పుడప్పుడూ పోతూ ఉంటే బాగుంటుందేమో. చిన్న జలుబు కూడా తెలియకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది? నిజానికి చాలా బాగుంటుంది. అందరికి ఇది అంత ఈజీ కాదు లే. అయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒకే ఒక్క రాత్రి చాలులే జీవితం మలుపులోకి పోవటానికి. అసలు ఏ పని పాడూ లేకుండా ఆడుతూ పాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటే కాళ్ళు నొప్పులు, గొంతు నొప్పులు వస్తాయి. మరి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉన్నా గాని కాసేపు ఖాళీ దొరికితే ఆలోచనలోకి నవ్వు రావాలి, రాత్రి మంచం ఎక్కగానే మంచి నిద్ర రావాలి. అలా ఉన్నప్పుడే కదా మనసుకి హాయిగా ఉండేది.


ఇప్పుడున్న రోజుల్లో అందరూ ఏదో ఒక బాధలో ఉన్నవారే. కానీ అందరి బాధల్లో అధికంగా ఉన్న కామన్ పాయింట్ ఏంటో నేను చెప్పనా. అదేంటి అంటే వారి బాధ అసలు అసలైన బాధ కాదు. అంటే స్వతహాగా అది బాధే కాదు. అలాంటి ఒక బాధని ఎవరికి వారే కల్పించుకున్నారు. ఎందుకు అంటే అది వారి బలహీనత. అసలు ఏ బాధ లేకుండా మనిషి ఉండగలడా అంటే నేను యెస్ అనే చెప్తాను. ఎలా అంటే మాత్రం అందరికీ అర్ధం అయ్యేలా చెప్పలేను.

ఎవరి బాధలు వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్తే అపుడు చెప్పగలను, వాటికి రెమెడీలు కూడా రెడీమేడ్ గా ఇవ్వగలను. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే నేనిచ్చే పరిష్కారాలతో మీ సమస్యల్ని మీరు పోగొట్టడానికి ఇష్టపడరు. దానికి కారణం మీలో ఉన్న మరో బలహీనత. అదే ఇగో. నేను ఇచ్చిన ఐడియా ఎందుకు ఫాలో అవ్వాలి అనే ఇగో. నా సొల్యూషన్ కంటే మీ సమస్యే గొప్పదని మీ ఫీలింగ్. ఎందుకు అంటే సమస్య మీది సమాధానం నాది అనే మీ పొగరే దానికి కారణం. ఇప్పుడు కాసేపు మీ ఇగో ని పక్కకి పెట్టి సమస్య తో పాటు సహాయం కూడా మీరే ఇచ్చుకోండి. అది ఎంత చెత్తగా ఉన్నా మీకు నచ్చేస్తుంది. అదే కదా అసలు సమస్య.



పాయింట్ టు బి నోటేడ్. అందరికి ఉన్న ఒకే సమస్య ఇగో. దానికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం లాంటి నానార్ధాలు చెప్పి నిన్ను నువ్వే మోసం చేసుకోకు గురూ. నీది నాది ఒకే కథ. కదా...!


ఈ ఒక్క ముక్క అర్ధం చేసుకుంటే నీకే కాదు, నాకు కూడా ఉన్న సమస్యలు అన్ని సులువుగా పోతాయి. అన్ని ప్రశ్నలకి సమాధానం లేకపోవచ్చు కానీ అన్ని సమస్యలకి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనకి నచ్చక కొన్నిటిని పట్టించుకోము. అంతే.


అందరూ కొన్ని జరగాలి అనుకుంటారు. అలా జరగకపోతే అంతా పోయినట్టు ఏడుస్తారు. దానికంటే ఎలా జరగాలో ముందే అనుకోవటం మానేస్తే బెటర్ అనే సొల్యూషన్ ని పట్టించుకోకుండా ఇంకేదో జరగాలి అని కోరుకుంటారు. దీన్నే తప్పు మీద తప్పు చేయటం అంటారు. ఇగో కి పోయి మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. ఏం జరిగినా చివరికి ఏడవను అనుకున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది. కానీ అది జరిగే పని కాదుగా. వద్దన్నవి తిన్నప్పుడు వచ్చే వాంతుని తన వంతు వచ్చినప్పుడు వచ్చే ఏడుపుని ఎలా ఆపుతావ్?


ఏ ఆలోచన లేకుండా బ్రతకగలిగినప్పుడు గానీ లేదా ఏ ఆలోచన వచ్చినా అలాగే వదిలేయగలిగినప్పుడు గాని ఆ ఆలోచన చేసే మనసుకి కలిగే హాయి అంతా ఇంతా కాదు తెలుసా? మంచి చెడుతో సంబంధం లేకుండా ఏ అలవాటు లేని అంటే ఎలాంటి ఎడిక్షన్ లేని జీవి ఉంటే అదే అన్నిటి కంటే చిరంజీవి. అది తినాలి, ఇది కొనాలి, అది తెయ్యాలి ఇది కొయ్యాలి, అటు పోవాలి, ఇటు కావాలి లాంటి ఆబ్లిగేషన్ లు గొంతెమ్మ కోరికలు లేని జీవితం ఎవరికి ఉంటుంది? కానీ అలా ఉంటే అదే అందమైన జీవితం. కాదు ఆనందమైన జీవితం. ఆనందం అనేది అది పొందే మనసుయొక్క పరిపక్వత మీదే ఆధారపడి ఉంటుంది.


ఎప్పుడూ గెలవాలి అని అనుకుంటే ఓడిపోయినప్పుడు వచ్చే బాధని తట్టుకోవటం కష్టం అవుతుంది. గెలుపు అనేది ఊపుని ఇవ్వాలి కానీ అదే ఊపిరి అనిపించే ఊహని ఇవ్వకూడదు. ఒకడిని నువ్వు శత్రువుగా భావించినప్పుడే కదా వాడు గెలిచాడు నువ్వు ఒడిపోయావ్ అని అనిపిస్తుంది? ఆలోచిస్తే అతిశయమే అన్నారు. మనకున్న సమస్య ఏదైనా అవొచ్చు దానికి ఆ సమస్య కూడా ఊహించని పరిష్కారం ఉంటుంది. Just dare to accept it. నా దృష్టిలో నీకు నాకు ఉన్న ఒకే సమస్య ఇదే, ఒకడు చెప్తే ఒప్పుకోకపోవటం.


నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటా, నేను చెప్పినప్పుడు నువ్ కూడా ఒప్పుకో. పోనీ కనీసం తప్పుకో. కానీ తప్పు అని వాదించి సమస్యని పెద్దది చేసుకోకు.


-ఎక్స్.

Friday, September 17, 2021

Lost in Past

B032 dated at Pedamynavanilanka the 17.09.T21


కొన్ని వస్తువుల్ని చూస్తే వాటికి ప్రాణం పోసి మాట్లాడాలి అనిపిస్తుంది. మన కంటే ముందు నుంచీ మన ఇంట్లో ఉంటూ కిక్కురుమనకుండా మనకు మించి మన ఇంటికి ఉపయోగపడుతూ వాటితో మనకున్న బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో కొన్ని ప్రదేశాలతో మనకి ఉండే ఆ అనుసంధానం కూడా అలాగే ఉంటుంది. అప్పట్లో మనం అన్నం తిన్న కంచం, చిన్నగా ఉన్నప్పుడు మనం కూర్చున్న చిన్న పీట, ముందు తరం నుంచే మనల్ని అలరిస్తూ వచ్చిన రేడియో, ఆ పై వచ్చిన టేప్ రికార్డర్, మనం కోసమే నాన్న కొన్న వాక్ మాన్ ఇలాంటివన్నీ ఇపుడు మన ఇంట్లో ఓ మూలన ఏ పనీ చెయ్యకుండా ఉసూరుమని పడుంటే ఒకప్పుడు వాటితో ఉన్న జ్ఞాపకాలు మరింత మధురంగా కనిపించటమే కాకుండా ఒకింత బాధగా కూడా అనిపిస్తాయి. మన చిన్నప్పుడు మనం కూర్చున్న మడత మంచం మీద ఇపుడు మన పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ఆ మంచానికి మనసుంటే ఎంత గర్విస్తుందో అనిపించే ఆ ఆలోచన అదోరకం. వాక్ మాన్. ఈ మాటకే నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తుంది. 2002 కి కాస్త ముందు అనుకుంటా, తెలిసిన వాళ్ళు ఎవరో వాక్ మాన్ తెచ్చి మా ఇంట్లో పెట్టి తర్వాత తీసుకెళ్లిపోయారు. అలాంటి దానిపై మనసు పడ్డ నేను ఒకటి కొనమని మా ఇంట్లో అడిగాను. ఎలా అడిగాను అంటే ఇప్పుడు నా కూతురు తన నోట్లోంచి మాట వస్తే వదలకుండా ఎలా అడుగుతుందో అలా. నా కూతురుకి నా దగ్గర ఉన్న చనువు అప్పట్లో మా నాన్న దగ్గర నాకు లేదు కాబట్టి గట్టిగా అడగలేకపోయినా ఇంట్లో మిగిలిన వాళ్లకి అర్ధం అయ్యేది. రెపల్లెలో రాధ అనే సినిమా పాట ని లిరిక్ మార్చి వాక్ మాన్ కొనమని పాడే వాడిని. మొత్తానికి కొన్నారు. 160 రూపాయలు అన్నట్టు గుర్తు. మైమరచి చెవిలో పెట్టుకుని పాటలు వినేవాడిని. తర్వాత కాస్త అటు ఇటు అయ్యి సరిగా పనిచెయ్యకపోతే మరమ్మత్తులు చేసి వాడుకుంటుండగా 2008 లో హాస్టల్ ఖాళీ చేసేటప్పుడు మా క్లాస్ మేట్ కిరణ్ గాడు నా దగ్గర నుంచి అది తన రూమ్ కి తీసుకెళ్లి అది ఒక పనికి రానిది అనుకుని నా దగ్గరకు వచ్చి నా కళ్ళ ముందే నేలకేసి కొట్టాడు. గుండె పగిలినంత పనయ్యింది నాకు. ఒక ఆంటిక్ పీస్ లా చూసుకున్న నా వాక్ మాన్ ని పగలకొట్టిన వాడిని కొట్టాలనిపించింది కానీ ఏం చెయ్యలేకపోయాను. ఇలాగే క్రికెట్ బ్యాట్ కూడా కొనిపించుకున్నాను చిన్నప్పుడు. హీరో హోండా స్టిక్కర్ తో ఉన్న ఆ బ్యాట్ 120 రూపాయలు. అది హ్యాండిల్ విరిగిపోతే ఫెవికాల్ తో అతికించుకుని దాని మీద పెయింట్ వేసుకుని నచ్చిన పేరు రాసుకొని వాడుకున్నాను. కాదు ఆడుకున్నాను. అది ఇప్పుడు లేదు లే ఏమైందో మరి. రేడియో, హీరోయిన్ సౌందర్య చనిపోయిందని అందులో విన్న వార్త, టీవీ లో టెలికాస్ట్ ఇవ్వని కొన్ని క్రికెట్ మ్యాచ్ ల కామెంటరీ. అలాగే తర్వాత వచ్చిన సీడీ ప్లేయర్ తో అంత అనుబంధం లేదు కానీ ముందు ఉన్న టేప్ రికార్డర్, అందులో వేసిన క్యాసెట్లు, పని చేసుకుంటూనే విన్న పాటలు, సినిమా కథలు, అది ఆగినప్పుడు వచ్చే జింగిల్ బెల్ మ్యూజిక్ ఇవేమీ మర్చిపోయేవి కాదు. ఇలా పాత వస్తువుల్ని వాటి జ్ఞాపకాల్ని కోకొల్లలుగా దాచుకున్న నేను 2009 లో లాప్టాప్ కొన్నాక 2007 నుంచి మార్చి మార్చి వాడుతున్న ఫోన్ల లోని sms లని కూడా laptop లో జ్ఞాపకాలుగా దాచుకునే వాడిని. కానీ తర్వాత వాటిని కూడా గుర్తు తెలియకూడదనుకున్న వాడొకడు డిలీట్ చేసాడు. ఇలా దాచుకున్నవి పోగొట్టుకున్నప్పుడు వచ్చే బాధ వెంటనే పోదు అనిపిస్తుంది కానీ ఇలా దాదాపు అన్నీ పోగొట్టుకుంటుంటే అదే అలవాటు అవుతుంది.

ఇందాక రేడియో నుంచి లాప్టాప్ వరకు వచ్చాం కానీ మధ్యలో ఒకటి మర్చిపోయాం. శుక్రవారం రాత్రి ఏడున్నర కి వచ్చే సినిమా పాటలు చూడటానికి పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం నుంచి, సాయంత్రం బడి అవ్వగానే మొదలు పెట్టి రాత్రి ఏడు అవ్వగానే 15 నిమిషాల ఖబరే తో కలిపి అరగంట వార్తలు రావటంతో అది చూడటం ఎదో పాపం అన్నట్టు ఇంటికి వచ్చేయటం, తర్వాత మా నాన్న కొత్త టీవీ కొని దాన్ని చెక్ చేయటం కోసం భుజాన వేసుకుని మా పెదనాన్న ఇంటికి నడిచి వెళ్ళటం, నేను కూడా వెనకే వెళ్లి అన్నీ చూసి రావటం, అది సరిగా రాని సమయంలో ఇల్లు ఎక్కి ఏంటెనా తిప్పటం, కేబుల్ కనెక్షన్ ఇచ్చాక ఫైబర్ వయర్ తో ప్రయోగం చెయ్యటం, ఒకసారి స్టబిలైజర్ షాక్ కొట్టడం, మా అన్న వాళ్ళ ఇంట్లో టీవీ వెనక పిన్ పోతే దాన్ని కొనటానికి ఇద్దరం కలిసి పది రూపాయలు తీసుకుని ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కి వెళ్ళటం, బ్లాక్-వైట్ టీవీకి కలర్ గ్లాస్ పెట్టి చూడటం, తర్వాత పెద్ద సైజ్ కలర్ టీవీని సెకండ్ హాండ్ లో కొనటం, ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ మరమ్మత్తులు చేయించి అదే టీవీ మా ఇంట్లో వాడుతూ ఉండటం వరకు ఇవన్నీ ఎలా మర్చిపోతాను. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళెవరికి ఇవన్నీ గుర్తు ఉండవు కానీ నాకు? ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ కూడా గుర్తు పట్టని, అవి చేసిన వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోని కొన్ని టీవీ షో లు నాకు గుర్తు ఉన్నాయి.  

ఇక విషయంలోకి వస్తే నాకు డైరీగా ఉపయోగపడుతూ ఆరున్నర సంవత్సరాలుగా గతంలో ఎప్పుడు ఏం జరిగిందో ఇట్టే చెప్పగలిగే అందమైన అనుభూతులు దాక్కున్న నా వాట్సాప్ మెసేజెస్ అన్నీ కేవలం నా చిన్నపాటి పొరపాటు, అందులో నా తొందరపాటు వల్ల పోయాయి. మళ్ళీ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయాయి. బాధ పడటం, move on అనే వాళ్ళు ఇచ్చిన సలహాను పాటించటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. గూగుల్ ఫొటోస్ లో అయితే మూడు అకౌంట్లు నిండిన జ్ఞాపకాలు ఉన్నాయి. అవైనా పోకుండా కాపలా కాస్తుండాలేమో. 


జ్ఞాపకాల విలువ తెలిసిన చాలా మందికి నాలాగే అనిపిస్తుంది. భద్రంగా దాచుకున్న వాళ్ళ పెళ్లి ఫోటోలు, ముద్దొచ్చే వాళ్ళ పిల్లల ఫోటోలు కేవలం చిన్న చిన్న అజాగ్రత్త వల్ల చేజారిపోతే ఎంత బాధ పడతారో నేను చూసాను. ఒక ఫ్రెండ్ అయితే తన కొడుకు ఫోటోలు ఉన్న మెమరీ కార్డ్ కరప్ట్ అయితే దాన్ని రిపేర్ చేయటానికి లక్ష ఖర్చు అయినా పర్వాలేదు అన్నది.


అదే ఫ్రెండ్ మా ఇంట్లో పాడైన పాత టేప్ రికార్డర్ ఉందని చూపిప్తే నాకు అలాంటివి ఇష్టం ఇచ్చేస్తావా అన్నది. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు అనిపిస్తుంది నా లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని. 


ఇప్పుడు కూడా మూలబడి ఉన్న కొన్నింటి దుమ్ము దులిపితే ఎన్నో మంచి జ్ఞాపకాలు కొన్ని రోజులుపాటు వెంటాడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెయ్యలేని వాటిని ఒకప్పుడు ఉద్ధరించాం అనటానికి ఆనవాళ్లే ఈ అనుభవాల్ని పంచే జ్ఞాపకాలు. నేను ఎంతమందికి గుర్తు ఉంటానో తెలియదు కానీ నా ప్రతి నిన్నలో నాకున్న జ్ఞాపకాలను బట్టి వాటిని పంచిన ప్రతీవాళ్ళు నాకు గుర్తు ఉంటారు. 


ఏది ఏమైనా పోతే తిరిగిరావు అనే వాటి విషయమై కనీస బాధ్యత లేకపోతే కన్నీరే మిగులుతుంది. వ్యక్తులైనా వస్తువులైనా.



-eckce

MABP

B050/MABP dated at Tadepalligudem the 09.04.T24 తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని. ఈ సామెత ఇప్పుడు ఆచరణలో ఉందా? తాళం గొళ్ళెం స్థానం లో కాలానుగ...